Saturday, July 27, 2024

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

- Advertisement -
- Advertisement -

Medaram jatara

 

మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం జాతర. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. అందుకే దీన్ని తెలంగాణ కుంభమేళా అంటారు. కేవలం నాలుగు రోజుల్లోనే దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది హాజరయ్యే అభయారణ్యంలో జరిగే అద్భుత జన జాతర. ఏడాదికేడాది పెరుగుతున్న భక్తుల తాకిడి తట్టుకోలేక, రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తున్నది. 830 ఏళ్ళుగా జరుగుతున్నా, నేటికీ ఆదరణ తగ్గకపోగా, నానాటికీ జన సందర్శన పెరుగుతున్న ఏకైక జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం, పూర్వపు వరంగల్ జిల్లా, నేటి ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో జరుగుతున్నది.

అడవి బిడ్డల అస్తిత్వ ఆత్మగౌరవమే సమ్మక్క
ప్రాచుర్యంలో ఉన్న కథనాల ప్రకారం సమ్మక్క ప్రతాపరుద్రుడి కాలం నాటి వాళ్ళు. క్రీ.శ.-1158 నుండి 1195 వరకు ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పాలించాడు. అప్పటి కాకతీయ సామ్రాజ్యంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు, తన ఏకైక కుమార్తె సమ్మక్కను, అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళి చేశాడు. సమ్మక్క-పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్యవిస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు.

ఆ దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అయితే, మేడారాన్ని పాలించే కోయరాజు ‘పగిడిద్దరాజు’ కాకతీయుల సామంతునిగా ఉన్నా డు. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడమేగాక, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కాకతీయ రాజుకు కన్నెర్ర అయింది. సార్వభౌమునికి వ్యతిరేకంగా కోయల్లో తిరుగుబాటు భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడికి కోపమొచ్చింది. పగిడిద్ద రాజుని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తాడు.

సామంతుడైన పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి ఆదివాసీ సంప్రదాయ ఆయుధాలతో వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ, సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. ఓటమి వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

వీరోచిత సమ్మక్క
ఇక యుద్ధంలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని సమ్మక్క ముప్పు తిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాడింది. ఆదివాసీ మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోయాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది.

ఆ పసుపు, కుంకుమల భరిణెనే సమ్మక్కగా భావించి, అప్పటి నుంచి ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మరో కథనం ప్రకారం మేడరాజు రాజ్యమే మేడారంగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకో కథనం ప్రకారం అసలు మేడారం జాతర 1940కి ముందు బయ్యక్కపేటలో జరిగేదని, అక్కడి వడ్డె (పూజారు)లు వృద్ధాప్యంతో పూజలు నిర్వహించలేని పరిస్థితుల్లోనే మేడారంకు జాతర మారిందని కూడా మరో చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. మొత్తానికి ఆదివాసీల వన దేవతగా మారిన సమ్మక్క, అదే అడవి బిడ్డ.

తెలంగాణ కుంభమేళా
1940 నుంచి చిలకలగుట్టపైనే ఆదివాసీలు మాత్రమే జాతరను జరిపేవారు. 1946 నుంచి జాతరను మేడారంలో నిర్వహించడం మొదలైంది. ఆ తర్వాత 1962 సంవత్సరంలో సారలమ్మను కీకారణ్యంలోని మేడారం గద్దెలపై ప్రతిష్ఠించారు. 1968లో జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 1998లో ఈ జాతరను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబమైన మేడారం జాతరను స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల ఆత్మగౌరవ పండుగగా, అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది.

శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులతో నిర్వహించే జాతర కాస్తా తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్వీయ అస్తిత్వం సంతరించుకుంది. 2016లో తొలిసారిగా స్వరాష్ట్రంలో జరిగిన జాతరకు రూ.136 కోట్లను మంజూరయ్యాయి. 2018లో రూ. 80 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 75 కోట్లు కేటాయించారు. ఏటేటా మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు జరుగుతుండటంతో ప్రభుత్వం, నిధులను కాస్త తగ్గించి ఇస్తున్నది. 2018 జాతరకు కోటి 30లక్షల మంది భక్తుల రాగా, ఈ ఏడాది కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. మరోవైపు భక్తుల కోసం మేడారం జాతరలో 24 గంటల పాటు విద్యుత్, మంచి నీటి వసతి, రవాణా సదుపాయాలను ప్రభుత్వం భారీ ఎత్తున కల్పిస్తున్నది.

జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వన దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున ఆ ఇద్దరు వన దేవతలు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం దేవతలు ఇద్దరినీ తిరిగి వారి స్థానాలకు తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న ఆదివాసీలే ఇక్కడ పూజా (వడ్డెలు)ర్లు కావడం విశేషం. భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించడం ఈ జాతర ప్రత్యేకతలు. అటు చారిత్రకంగా ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఇటు ఆధ్యాత్మికంగా అత్యంత మహిమాన్వితంగా నిలిచిన ఈ జాతరకు ఏటేటా జనం పోటెత్తడంతో, ప్రతి రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్నారు.

జాతీయ గుర్తింపు కోసం
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న డిమాం డ్ చాలా ఏళ్ళుగా పెండింగులో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద పండుగ కుంభమేళా తర్వాత కుంభమేళాగా జరుగుతున్న జాతరని జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నది. ఆ విషయంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆశిద్దాం.

ప్లాస్టిక్ రహితంగా..
పూర్తిగా ఆదివాసీ సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుండి కోటిన్నరకి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే, ఈ సారి మేడారం జాతరలో ప్లాస్టిక్‌ని నిషేధించారు. ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మేడారంకు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయ వస్తువులనే భక్తులు తీసుకెళ్ళాలి. పచ్చని ప్రకృతిని కాపాడాలి. అడవి తల్లులను కొలుస్తూ, అడివి బిడ్డలకు కాలుష్య రహిత భవిష్యత్తుని ఇవ్వాలి. మనమంతా పర్యావరణానికి పాటు పడాలి.

Adivasis self respecting Medaram jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News