Wednesday, July 17, 2024

వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక

- Advertisement -
- Advertisement -

financial survey report

 

సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ రెండు ఉంటేనే దేశమైనా, కుటుంబమైనా వృద్ధి చెందుతుంది. ఈ రెండు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంది. డబ్బు-, సంపదల అవినాభావ సంబంధాల గురించి తమిళ సాహిత్యంలో ప్రధానమైన ‘తిరుకురాల్’ లో ప్రస్తావించిన అంశాన్ని ఉదహరిస్తూ, ఈ సంవత్సరపు “ఆర్థిక సమీక్ష” కొనసాగింది. అలాగే కౌటిల్యుని అర్థశాస్త్రంలో సూచించిన పన్నుల విధానం గురించి పేర్కొంటూ ప్రభుత్వ విధానాలు, పాత్ర తక్కువగా, సంక్లిష్ట రహితంగా ఉండాలని, మార్కెట్‌లోని అదృశ్య హస్తానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అర్థశాస్త్రంలో ఆడమ్‌స్మిత్ సిద్ధాంతంలో మార్కెట్ ఉత్థాన పతనాలకు ముఖ్యకారణం ప్రజల వినియోగ శకి,్త- సరఫరాలు ప్రధానమే అయినా మార్కెట్ చోదక శక్తిగా అదృశ్య శక్తి ఉంటుందనే సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని, మార్కెట్ల చలనశీలతకు ప్రభుత్వ విధానాలు అడ్డుగోడ కాకూడదని, వీలైనంతగా ప్రభుత్వం ఒక పరిశీలకుడుగా, చేయూతనందించే స్నేహితుడుగా మాత్రమే ఉండాలనే సలహాను ఈ సంవత్సరపు ఆర్థిక సమీక్షలో మర్మగర్భంగా తెలియజెప్పారు. ఆర్థిక సర్వేక్షణలో నిర్మోహమాటంగా దేశ ఆర్థిక రుగ్మతలకు చేయాల్సిన కాయకల్ప చికిత్సను తెలియజెప్పినా, ఆ తరువాతి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక సర్వేక్షణలో చెప్పిన విషయాలను పూర్తిగా విస్మరించడం పరిశీలకులకేగాక, బిజెపి నాయకులను కూడా విస్మయపరిచింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, ప్రభుత్వ జోక్యం వలన సంపద సృష్టిలో, పంపకంలో వ్యత్యాసాలు ఉంటాయని, సృష్టించిన సంపదను అందరికీ అందించాలంటే మార్కెట్లోని అదృశ్య హస్తానికే వదిలేయాలని సూచించారు.

కౌటిల్యుడు సూచించినట్లు పన్నుల విషయంలో ఉదారంగా ఉండాలని, ప్రత్యక్ష పన్ను లు అందరికీ లాభం చేకూరే రీతిలో ఉండాలని ఆర్థిక సర్వేక్షణలో తెలిపారు. రాష్ట్రాల సహకారం తోనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమని, అందరినీ విశ్వాసంలోకి తీసుకోగలిగితేనే అనుకున్న 5 ట్రిలియన్లు, జిడిపి లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆర్థిక సలహాదారుల మాటలు ఆర్థిక మంత్రికి గాని, ప్రధానమంత్రికి గాని చేరినట్లు లేదు. అందుకే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల విషయంలో లేనిపోని గందరగోళం సృష్టించే కొత్త విధానాన్ని తెచ్చారు.

సంపన్నులపై పన్ను వేస్తే పెట్టుబడులకు ఎలాంటి అడ్డు ఉండదని ఆర్థికవేత్తలు చెపుతుం టే, కంపనీలు చెల్లించాల్సిన డివిడెండ్ పంపకం పన్నును వాటాదారుల ప్రత్యక్ష పన్ను లో కలపడం మరింత గందరగోళానికి దారితీయడమే కాకుండా, వ్యక్తిగత పనుల శ్లాబులలో మార్పులకులోనై, ఎక్కువపన్ను చెల్లించాల్సిన పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. సామాన్యుల పొదుపు వల్లే ప్రభుత్వానికి ఎక్కువ లాభం ఉంటుందని ఆర్థికవేత్తలు చెపితే అందుకు విరుద్ధంగా, సామాన్యుల అసలు ఆదాయానికి గండిపడే పన్నుల విధానం తెచ్చారు.ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ఇచ్చే మినహాయింపులు తొలగించడం వల్ల మధ్య తరగతి కుటుంబాలపై ఎక్కువ భారం పడుతుంది.

విద్యపై 30-45 సంవత్సరాలు వయసు గల యువతే ఎక్కువ ఖర్చు చేస్తున్నది. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలియంది కాదు. అలాగే 40 -60 సంవత్సరాల మధ్య ఉండే వారు ఆరోగ్య బీమా కొరకు ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. ఈ రెండు పద్దులను పన్ను మినహాయింపు నుండి తొలగించడం వల్ల మధ్య తరగతి కుటుంబాల చేతికి వచ్చే నిజమైన ఆదాయం తగ్గిపోతుంది. దీనితో వారి వినిమయశక్తి, కొనుగోలు శక్తి తగ్గడం అంటే, మార్కెట్‌లో మరింత డిమాండ్ తగ్గడమే. ఇది సంపద సృష్టికి ఆటంకమే కదా?

సంపద సృష్టి వల్లనే దేశ ఆర్థిక ప్రగతి బాగుపడుతుందని గట్టిగా నమ్ముతూ, దానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కాని వ్యాపారం చేయడం అన్నింటిలో తన ప్రమేయం ఉండాలనే కాలం చెల్లిన నమ్మకాలను, విశ్వాసాలను అంటిపెట్టుకొని ఉండకూడదని 2019- 20 సంవత్సరానికి గాను ఆరునెలల్లో, రెండోసారి చేసిన ఆర్థిక సమీక్షలో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం విస్పష్టంగా పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఉత్సాహవంతుడైన పారిశ్రామికవేత్త ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఒక వస్తువును ఎగుమతి చేయాలంటే ఒక చోటునుండి మరో చోటుకు తరలించడానికి ఎన్ని పని దినాలు వృథా అవుతున్నాయో వివరంగా పరిశీలించారు. మన విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో, నౌకాశ్రయాల్లో ఒక్కో చోట ఒక్కో పనికి పట్టే పని దినాల వల్ల జరిగే నష్టాన్ని కళ్ళకు కట్టేట్లుగా ఈ సమీక్షలో తెలిపారు.

దేశంలో ఆయుధాలు కలిగి ఉండడానికి ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవడం చాలా రాష్ట్రాల్లో వ్యాపార అనుమతులు పొందడాన్ని కన్నా ఎంతో సుళువని నిరూపించారు.కాలం చెల్లిన చట్టాల వల్ల రైతులు, వ్యాపారస్థులు ఎంతో నష్టపోతున్నా వాటి సవరణకు లేదా వాటి తొలగింపుకు ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శిస్తూనే ఇలాంటి వాటిని తొలగించడం వల్లనే వ్యవసాయ ధరల స్థిరీకరణకు అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మన దేశానికి అవసరమైన దానికన్నా ఎక్కువ స్థాయిలో ఆహార ఉత్పత్తులు జరుగుతున్నపుడు, రైతు వాటిని తనకు నచ్చిన మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముకోవడానికి అనువైన జాతీయ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశలో ఆలోచించాలని సూచించారు. అలాగే వ్యాపారస్థులు తాము కొన్న సరుకును నిల్వ చేసుకొనే సమయంలో అది ఎంతమేర నిల్వ చేసుకోవాలనే దానిపై ఆంక్షలు తొలగించాలని, నిజమైన నిల్వను దురుద్దేశపూరితంగా చేసే నిల్వల విషయంలో కొంత స్పష్టత రావాలని ఆర్థిక సమీక్షలో సూచించారు.

దేశంలో అప్పటి(1955) పరిస్థితుల వల్ల రూపొందించిన “నిత్యావసర వస్తువుల చట్టం” వల్ల ఈ రోజు రైతులతో పాటు, వినియోగదారులకు కూడా నష్టమే కలుగుతున్నదని, దీన్ని తొలగించాలని సూచించారు. అలాగే ఆశ్రిత వర్గాల కోర్కెలను తగ్గించాలని, వారిని లేదా అలాంటి వారిని ప్రోత్సహించే చర్యలకు మంగళం పాడితేనే దేశ సంపద వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ఎంతో కొంత వృద్ధి జరగాలంటే అక్కడి ప్రజలలో అక్షరాస్యత పెరగాలని, అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లాల నుంచి నూతన యువ పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని సర్వేలో తెలిపారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతూ, నవ భారత నిర్మాణానికి అనుగుణంగా, దేశ జాతీయోత్పత్తిని రూ. 5 లక్షల కోట్ల (5ట్రిలియన్ల) స్థాయికి చేరాలంటే అందుకు పరస్పర సహకారం, భరోసా అవసరం అని చెప్పింది.

భారతదేశంలో సరళీకరణ విధానాలు అమలు చేసినప్పటి నుండే మార్కెట్ శక్తులకు, కొత్త పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం లభించిందని, పాత సిద్ధాంతాలను వదులుకోవడం వల్లనే దేశ జాతీయోత్పత్తి పెరుగుతున్నది. ప్రపంచంలో జనాభా రీత్యా గొప్పగా ఉన్నా, ఆర్థిక స్థాయి రీత్యా భారతదేశ ఎన్నో దేశాలకన్నా వెనుకబడి ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో బలమైన పెద్ద బ్యాంకుల జాబితాలో భారతదేశంలోని ఒకే ఒక బ్యాంకుకు స్థానం లభించింది. మన దేశ స్థాయిని, ఆర్థిక స్థాయిని పరిశీలిస్తే మన దేశానికి చెందిన కనీసం మూడు బ్యాంకులకు ఆ జాబితాలో స్థానం లభించాలి.

అలాగే మన దేశం సృష్టించే సంపదలో చాలా మట్టుకు కొందరి వద్దే కేంద్రీకరించబడుతున్నది. దేశ సంపద అందరి మధ్య సరిగా, సక్రమంగా పంచబడడమే నిజమైన అభివృద్ధిగా వర్ణించారు. లాభాలు తెచ్చే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడంపై వ్యాఖ్యానిస్తూ ప్రైవేటీకరించిన ప్రభుత్వ సంస్థలో మార్కెట్ వాటా ముందటి కంటే ఎక్కువగా ఉందని, ప్రభుత్వం వ్యాపార సంస్థ కానందున వీలైనంతగా వ్యాపార భాగస్వామ్యాలను తగ్గించుకోవాలని సూచించారు.

భారతదేశంలో ప్రభుత్వాలు ఇప్పటి వరకు దేశ మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోలేదని, ప్రపంచ మార్కెట్ ధోరణులను పరిశీలిస్తూ, అందుకు అనుకూలంగా తన పన్నుల విధానాన్ని, పారిశ్రామిక విధానాలను మలుచుకొంటే రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించవచ్చని సూచించారు. “మెక్ ఇన్ ఇండియా”కు ముందు “అసెంబుల్ ఇండియా” ను తయారు చేయాలని, అదే ముందు ముందు భారత్ ను ప్రధాన ఎగుమతి దేశంగా మారుస్తుందని, భారతదేశంలోని యువశక్తిని వాడుకొని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల “సమీకరణ- చేయడం” అనే ప్రక్రియ ద్వారా ఇతర దేశాల కన్నా ఎక్కువ లాభం పొందవచ్చని, మరో 10 ఏళ్లలో 8 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, మనం ఆశించే 5 ట్రిలియన్ల జాతీయోత్పత్తి సాధించడానికి ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం ఉండదని ఆశించారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సర్వేక్షణలో ఎంతో నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా భారతదేశ ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ, విశ్లేషిస్తూ ఎంతో వివరంగా రూపొందించిన నివేదికలోని అంశాలను ప్రభుత్వంలోని పెద్దలు సమగ్రంగా అర్థం చేసుకొన్నట్లు లేదు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడకుండా, దేశీయ పొదుపును పెంచి, మార్కెట్‌లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఆర్థికవేత్తల సూచనలను ప్రభుత్వాధినేతలు పరిగణనలోకి తీసుకోవాలి. దేశ భవిష్యత్తు కొన్ని ఆశ్రిత వర్గాల చేతిలోనే ఉండదు. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టినా అందుకు తగ్గ కొనుగోలు శక్తి ప్రజల వద్ద ఉంటేనే వ్యాపారం కొనసాగుతుంది. నేడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు అవే. వీటిని పూర్తి స్థాయిలో తొలగించడానికి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలలో ప్రైవేట్ పెట్టుబడులు రావడానికి తగిన నైపుణ్యాలను యువతకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Real financial survey report
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News