Sunday, May 5, 2024

సూర్యుడి మీద ఉమ్మి!

- Advertisement -
- Advertisement -

 Independence Movement

 

ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ ‘హీరో’లను నెలకొల్పాలనుకుంటున్నారా? స్వాతంత్య్ర సమర ముఖ్య యోథుడు, ఆధునిక భారత నిర్మాత, దేశ శాస్త్రీయ చైతన్యమూర్తి ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా బిజెపి పెద్దలు పాటుపడుతున్న తీరు తెలిసిందే. ఇప్పుడు జాతిపిత మహాత్మాగాంధీపైనా ఆయన సారథ్యంలో మహోజ్వలంగా సాగి ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిన స్వాతంత్య్రోద్యమం మీద కూడా బురద చల్లే కార్యక్రమానికి వారు తెగించారు. ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు సాథ్వి అనబడే ప్రజ్ఞాసింగ్, గాంధీజీ హంతకుడు గాడ్సేను మహానుభావుడుగా కీర్తించగా ఇప్పుడు మరో ఎంపి, మాజీ మంత్రి అనంత కుమార్ హెగ్డే నేరుగా స్వాతంత్య్ర ఉద్యమాన్నే దూషించి పరోక్షంగా గాంధీని తక్కువ చేస్తూ మాట్లాడాడు.

ఈ క్రమం దేనిని సూచిస్తోంది? దేశ సెక్యులర్, సోషలిస్టు తరహా స్వరూపాన్ని రూపుమాపి దాని స్థానంలో హిందూ మతపరమైన జాతీయతను నెలకొల్పే ప్రయత్నంలో మన జాతి నేతలందరినీ అప్రతిష్ఠ పాలు చేసి దేశ ప్రజల గుండె గోపురాల నుంచి వారిని పెరికివేసే కుట్ర ఏదో కమలనాథుల బుర్రల్లోనూ వారి గురుపీఠమైన ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనల్లోనూ మెదులుతున్నదని అనుకోడం ఆక్షేపణీయం అనిపించదు. కర్నాటకకు చెందిన అనంత్ కుమార్ హెగ్డే మొన్న శనివారం నాడు బెంగళూరులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం పోరాడి సాధించుకున్నది కాదని, బ్రిటిష్ వారితో రాజీపడి సర్దుబాటు చేసుకుని వారి సమ్మతితో, మద్దతుతో తెచ్చుకున్నదని అన్నారు. స్వాతంత్య్రోద్యమ సారథులని భావిస్తున్నవారు ఎవరూ ఒక్క పోలీసు లాఠీ దెబ్బ తినలేదని అది నిజమైన పోరాటం కాదని అభిప్రాయపడ్డారు. అలాగే ‘ఉపవాస సత్యాగ్రహ’ అనే డ్రామా ద్వారా వారు మహా పురుషులు అయిపోయారని కూడా అన్నారు. ఇందులో గాంధీజీ ప్రస్తావన నేరుగా లేదని ఆయన బుకాయిస్తున్నారు.

సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకొని అంతటి బ్రిటిష్ సామ్రాజ్య చక్రవర్తులను గడగడలాడించినవారు గాంధీజీ కాదా, ప్రపంచమంతటికీ తెలిసిన ఈ ఘనతర వాస్తవం తెలియకుండానే అనంత్ కుమార్ హెగ్డే ఆ ఉపవాస దీక్షను గురించి ప్రస్తావించారా? ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వేదిక మీది నుంచి గాంధీ మహాత్ముని 150వ జన్మ దినోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ‘గాంధీజీ భారతీయుడయినా ఒక్క భారతదేశానికి మాత్రమే చెందినవాడు కారు’ అని అన్నారు. ‘నిజమైన ప్రజాస్వామ్య బలం మీద మహాత్మా గాంధీ దృష్టి కేంద్రీకరించారు. ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడానికి ఆయన దారి చూపించారు’ అని అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రశంసించారు. ‘ప్రజలలోని శక్తిని సరైన మార్గంలో నడిపించి మార్పును సాధించిన మహానుభావుడు గాంధీజీ’ అని కీర్తించారు.

మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గాంధీ నామస్మరణ ముమ్మరంగా చేపట్టారు. 2014 గాంధీ జయంతి నాడే స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. ఒకవైపు నెహ్రూను తెగనాడుతూనే గాంధీని, పటేల్‌ను, అంబేడ్కర్‌ను పొగడడం బిజెపి పాలకులకు అలవాటయింది. రాజ్యాంగ ఉత్సవాలు జరుపుకొని అంబేడ్కర్‌ను విశేషంగా గౌరవిస్తున్నట్టు ప్రకటించుకున్న వీరి పాలనలోనే దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఈ సరళిని చూస్తుంటే స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన జాతి నేతలను అంతరంగంలో బిజెపి వారు ద్వేషిస్తున్నారని భావించవలసి వస్తుంది. మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర పోరాట సారథి మాత్రమే కాదు అహింసను ఒక ఆయుధంగా మలచి దానితో ఎంతటి మంచినైనా సాధించవచ్చని చేసి చూపించారు.

నిరాడంబరత, సత్యసంధత ఈ రెండింటికీ ప్రతీకగా నిలిచిన గాంధీజీని తలచుకొని ప్రతి భారతీయుడు గర్వించవలసి ఉండగా ఆయన అయాచితంగా, అనుచితంగా మహాపురుషుడయిపోయాడని, ఉపవాస సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర సాధన అనేది ఒక డ్రామా అని అనగలిగిన బిజెపి నేత అనంత్ కుమార్ హెగ్డే ఎటువంటి దేశభక్తుడు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. స్వాతంత్య్ర పోరాటంతో అంతగా సంబంధం లేని కారణంగా గాంధీ, పటేల్‌లను అరువు తెచ్చుకొని ఉపయోగించుకుంటున్న కమలనాథులు ఇప్పుడు క్రమంగా వారిపై బురదజల్లే కార్యక్రమానికి తలపడుతున్నారని అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అనంత్ కుమార్‌పై బిజెపి నాయకత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది అనేది వేచి చూడవలసిన అంశం.

Ananta Kumar directly blames Independence Movement
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News