Thursday, May 2, 2024

ఢిల్లీలో అఫ్గాన్ ఎంబసీ మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ ప్రకటించింది. దీంతో 2023 నవంబర్ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి సెప్టెంబర్ 30నుంచే భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కానీ భారత ప్రభుత్వంనుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో శాశ్వత మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ ప్రకటించింది. దౌత్య అధికారుల్లో కొంత మంది తాలిబన్ ప్రభుత్వానికి విధేయత ప్రకటించడంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇదే ఢిల్లీలో రాయబార కార్యాలయం మూసివేతకు కారణమనే వార్తలు కూడా రావచ్చని పేర్కొంది.కానీ తమ విధానాల్లో విస్తృత మార్పులవల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలిపింది.

భారత్‌లోని అఫ్గాన్ పౌరులకు ఎంబసీ కృతజ్ఞతలు తెలియజేసింది.తమను అర్థం చేసుకుని సహకరించారని పేర్కొంది. కాబూల్‌లో చట్టబద్ధ ప్రభుత్వం లేకపోయినా.. పరిమిత వనరులు, అధికారాలతోనే వారి సంక్షేమానికి కృషి చేశామని పేర్కొంది.గత రెండేళ్లనుంచి భారత్‌లో అఫ్గాన్ వాసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని తెలిపింది. శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారులు దేశాన్ని వీడారని పేర్కొంది. అలాగే 2021 ఆగస్టు తర్వాత చాలా పరిమిత సంఖ్యలో కొత్త వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో గత ఆఫ్గన్ ప్రభుత్వానికి సంబంధించిన దౌత్య అధికారులెవ్వరూ లేరని ప్రకటనలో ఎంబసీ స్పష్టం చేసింది. వారంతా ఇతర దేవాలకు సురక్షితంగా చేరారని తెలిపింది.ప్రస్తుతం భారత్‌లో ఉన్న వ్యక్తులు తాలిబన్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న వారని తెలిపింది. తమ కార్యకలాపాలను పూర్తిగా భారత ప్రభుత్వానికి అప్పగించామని తెలిపింది.

తాలిబన్ దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వడమా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా అనే అంశాన్ని ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని పేర్కొంది. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు.ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవట్లేదు.దీంతో తమపట్ల భారత్ నిర్లక్షం వహిస్తోందంటూ ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకొంది.2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారం చేజిక్కించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News