Thursday, May 2, 2024

సిన్సినాటి ఫైనల్లో జ్వెరేవ్

- Advertisement -
- Advertisement -

Alexander Zverev reached to Cincinnati Finals 2021

సిన్సినాటి: జర్మనీ టెన్నిస్ వీరుడు అలెగ్జాండర్ జ్వెరేవ్ ఎటిపి సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు. స్టెఫానస్ సిట్సిపాస్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి సెట్‌లో రెండు బ్రేక్ పాయింట్లతో వెనుకబడి ఉన్నప్పటికీ అద్భుతంగా పోరాడి చివరికి 6-4, 3-6, 7-6 స్కోరుతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్ సెట్‌లో వాంతి చేసుకోవడం కోసం కొద్దిసేపు కోర్టు వదిలి వెళ్లిన జ్వెరేవ్ ఆ తర్వాత అద్భుతంగా పోరాటం సాగించి టై బ్రేకర్‌తో ఆ సెట్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా మ్యాచ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జ్వెరేవ్ రష్యాకు చెందిన ఆంద్రీ రెబ్లెవ్‌తో తలపడనున్నాడు. మరో సెమీఫైనల్లో రుబ్లెవ్ ప్రపంచ రెండో సీడ్, తన దేశానికే చెందిన దేనియల్ మెద్వెదేవ్‌పై 2-6, 6-3, 6-3 స్కోరుతో సంచలన విజయం సాధించాడు. రెండో సెట్ ప్రారంభంలోనే కడుపులో గడబిడ మొదలైందని, డాక్టర్‌ను సంప్రదిస్తే ఏవో మాత్రలు ఇచ్చాడని జ్వెరేవ్ చెప్పుకొచ్చాడు.. కాగా మొదటి సెట్ చివర్లో సిట్సిపాస్ దుస్తులు మార్చుకోవడం కోసం దాదాపు 8 నిమిషాల పాటు మైదానంనుంచి వెళ్లడంపై జ్వెరేవ్ చైర్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు కూడా. రెండో సెట్‌లో కూడా అతను మరోసారి బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ, ఇప్పటికే తనకున్న ఒక బ్రేక్ అవకాశాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని చైర్ అంపైర్ అతనికి గుర్తు చేశారు. కాగా రుబ్లెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్ మూడు సార్లు మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవలసి వచ్చింది. దీన్నిఅవకాశంగా తీసుకున్న రుబ్లెవ్ ఆ తర్వాత రెచ్చిపోయి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
మహిళల ఫైనల్లో బార్టీ
కాగా మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో 6-2, 7-5 స్కోరుతో ఏంజలిక్ క్రెబర్‌పై విజయం సాధించి ఈ సీజన్‌లో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. గత 82 వారాలుగా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బార్టీ కేవలం గంటా 15 నిమిషాల్లో ప్రత్యర్థిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో బార్టీ స్విస్‌కు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ జిల టీచ్‌మన్‌తో తలపడనుంది. సెమీఫైనల్లో టీచ్‌మన్, అయిదో సీడ్, చెక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాపై 6-2, 6-4 స్కోరుతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నమెంట్‌లో టీచ్‌మన్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడో రౌండ్‌లో ఆమె ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నవోమి ఒసాకాపై సంచలన విజయం సాధించింది.

Alexander Zverev reached to Cincinnati Finals 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News