Thursday, May 2, 2024

గ్రేటర్‌లో వార్డు పరిపాలన వ్యవస్థకు అంతా సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిహెచ్‌ఎంసి వార్డు పరిపాలన వ్యవస్థకు అంతా సిద్దం చేస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ వ్యవస్థను గ్రేటర్ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులుండగా ప్రతి వార్డులో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రజా సమస్యలకు పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి వార్డు కేంద్రంగా ఇప్పటీకే ప్రత్యేక కార్యాలయాలను గుర్తించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ పర్యవేక్షణలో వివిధ విభాగాలకు చెందిన 10 మంది అధికారులతో కూడిన బృందం వార్డు కార్యాలయం కేంద్రంగా సేవలను అందించనున్నారు.

ఇందుకు సంబంధించి వార్డుల వారిగా అధికారులు, సిబ్బందిని కేటాయించడమే కాకుండా వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రతి వార్డు కేంద్రంగా కార్యాలయాలను గుర్తించిన అధికారులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. కార్యాలయాల్లో కావాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలను నేటి నుంచి ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి అంతా పూర్తి చేసి 31వ తేదీన వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ కార్యాలయాల నుంచి వార్డు పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు.

సిద్దమవతున్న వార్డు కార్యాలయాలు: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సూచనల మేరకు జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా జూన్ 2 తేదీ నుండి వార్డు పరిపాలన చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్షంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డుల్లో 10 మంది అధికారుల బృందంతో వార్డు పాలన వ్యవస్థ మొదలవుతుందని తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఎంటమాలజిస్ట్, వార్డు ఇంజనీర్, వార్డు టౌన్ ప్లానర్, వార్డు కమ్యునిటీ ఆర్గనైజర్, వార్డు శానిటరీ జవాన్, వార్డు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ , వార్డు కంప్యూటర్ ఆపరేటర్, వార్డు రిసెప్షనిస్ట్, జలమండలి అధికారులు, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ అధికారులు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.

ఇందుకు సంబంధించి వార్డు కార్యాలయాను ఇప్పటీకే గుర్తించామని వాటిలో సదుపాయాల కల్పన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ నెల 31న వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం ఉంటుందని, జూన్2వ తేదీ నుండి నగర పౌరులకు వార్డు సేవలను అందించనున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి ‘మైజిహెచ్‌ఎంసి‘ యాప్ ద్వారా అందే పౌర సమస్యలపై ఇక మీదట వార్డు కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించడం ద్వారా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్నారని తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వార్డు నెం.93 సిటీ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న వార్డు ఆఫీస్ ను బుధవారం మేయర్ పరిశీలించారు. వార్డు కార్యాలయం పేర్లను తెలిపే బోర్డులను ప్రజలందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News