Sunday, October 1, 2023

ఇక మహిళా శకం

- Advertisement -
- Advertisement -

కొత్త లోక్‌సభలో సరికొత్త మహిళా బిల్లు

నారీశక్తి అభియాన్ వందన్‌గా సభ ముందకు..
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేస్తూ బిల్లు

ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్
రాజ్యాంగ సవరణ బిల్లుతో చట్టబద్ధత ఎస్‌సి, ఎస్‌టి సబ్ కోటా మిళితం, బిసి కోటా ప్రసక్తి లేదు

2027 తరువాతే అమల్లోకి
నేడు చర్చ, తరువాత ఓటింగ్
ఇది రాజకీయ జిమ్మిక్కు : కాంగ్రెస్
బిల్లుతో లింగ సమానత్వం, సామాజిక న్యాయం రావాలి : అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ : మహిళకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల కోటాను కల్పించే ఉద్ధేశం తో మంగళవారం లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. సంబంధిత రాజ్యాం గ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో నారీ శక్తి వందన్ అభియాన్ పేరిట కేంద్రం తరఫున తీసుకువచ్చారు. బిల్లుకు ఒక్కరోజు ముందే ( సోమవారం) కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డిలిమిటేషన్, రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదాలు, ప్రత్యేకించి దేశంలో నిర్ణీత జనాభా లెక్కల ప్రక్రియలు ముగిసిన తరువాత ఈ బిల్లు అమలులోకి వస్తుంది. అంతకు ముందు ఇ ప్పుడు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ తరువాత ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును మంగళవారం ప్రవేశపెట్టిన తరువాత సభను బుధవారానికి వాయిదా వేశారు. 15 సంవత్సరాల వరకూ మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీ లో 33 శాతం రిజర్వేషన్ల కోటా అమలులో ఉండేలా చట్టం తీసుకురావడానికి ఈ బిల్లును ఉద్ధేశించారు. ఈ బిల్లులోనే ఎస్‌సి/ ఎస్‌టిలకు సబ్ కోటా ఉంటుంది. ఒబిసి కోటా ప్రస్తావన లేదు.

ఇప్పుడున్న ప్రక్రియల సంపూర్తి పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు ఈ కోటా పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. మహిళలకు కోటాకు సంబంధించిన 128 సవరణ బిల్లు 2023ను దిగువసభలో సభా వ్యవహారాల అనుబంధ పద్దులో భాగంగా ప్రవేశపెట్టారు. చట్టసభలు అంటే లోక్‌సభ, రాష్ట్రాల విధాన సభల్లోని మూడింట ఒక వంతు అంటే అంటే దాదాపు 33 శాతం సీట్లు (ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో భర్తీచేసేవి) ఈ కోటా పరిధిలోకి వచ్చేలా ఈ బిల్లును రూపొందించారని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కీలకం. వరుసగా నిర్ణీత కాలానికి జరిగే డిలిమిటేషన్ ప్రక్రియ తరువాత ఈ కోటా పరిధిలో మహిళకు సీట్ల కోటాల రోటెషన్ వర్తింపచేస్తారని బిల్లులో తెలిపారు. కాగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి అవుతుంది. రాష్ట్రాలకు రాజ్యాంగం మేరకు ఉన్న హక్కులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ సమ్మతి అవసరం . గణేష్ చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ కొలువుదీరిన దశలో మంగళవారం తీసుకువచ్చిన సరికొత్త ఓం ప్రధమ బిల్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ఆమోదానికి అన్ని పక్షాల సహకారం అని అభ్యర్థించింది. దేశ రాజకీయాలు విధాన నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నందున, మహిళను విధాన నిర్ణయాత్మక శక్తిగా మలిచి తీరాల్చిన బాధ్యత అందరిపై ఉందని , ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లు ఇందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి తెలిపారు. చట్టసభలలో మహిళ గొంతుక మరింతగా ప్రతిధ్వనించాల్సి ఉందని ఈ నేపథ్యంలో తెలిపారు. రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో నిర్ణీత లక్షాల సాధన దిశలో మహిళకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం కీలకమని తెలిపారు. బారతదేశాన్ని 2047 నాటికి సంపన్న దేశంగా మలిచి చూపాలనే లక్ష్యంలో మహిళను భాగస్వామిగా చేయడం ఈ బిల్లు లక్ష్యం అని పేర్కొన్నారు.

దేశ ప్రగతిలో మహిళ మరింతగా కీలక పాత్ర: మోడీ
దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. ఈ మార్గంలో ఈ కీలక ప్రక్రియలో మహిళ మరింత ప్రాధాన్యత పాత్రను పోషించాల్సి ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకునే మహిళా బిల్లును తీసుకువస్తున్నట్లు బిల్లు సమర్పణకు ముందు ప్రధాని మోడీ లోక్‌సభలో తెలిపారు. దేశ ప్రగతి సాధన మహత్తర ఆలోచన, దీనితో పాటు పలు మహత్తర కార్యక్రమాల దిశలో మహిళ తన శక్తియుక్తులను చాటుకునేందుకు ఈ విధంగా వీలు కల్పిస్తున్నట్లు వివరించారు. వారికి కల్పించే సముచిత అధికారం గణనీయ మార్పునకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఈ బిల్లుపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ స్పందిస్తూ ఈ బిల్లు తమది అని పేర్కొన్నారు. కాగా ఎగువ సభకు బిల్లు వచ్చినప్పుడు దీనికి పార్టీలకు అతీతంగా మద్దతు అందించాలని రాజ్యసభలో ప్రధాని మోడీ కోరారు. బిజెపి ఈ బిల్లును చారిత్రకం , మోడీ దార్శనికత ఫలితం అని పేర్కొంది. కాగా బిల్లును స్వాగతించినా ప్రతిపక్షాలు ఇది ఓ ఎన్నికల స్టంటు అని విమర్శించాయి. సరైన ముందస్తు ్రప్రకియ లేకుండా బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. డిలిమిటేషన్, సెన్సన్ తరువాత బిల్లు అమలులోకి వస్తుందని బిల్లులోనే ప్రభుత్వం తెలిపిందని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. సెన్సస్‌ను పూర్తి చేయని ఏకైక జి 20 దేశం భారత్ అని విమర్శించారు. బిల్లును తాము పూర్తి స్థాయిలో అంగీకరిస్తామని, ఇందులో ఎస్‌సి/ ఎస్‌టి, బిసిల ఉప కోటాల వర్తింపు లేకపోయినా ఫర్వాలేదని బిఎస్‌పి అధినేత్రి మాయావతి తెలిపారు. ఇంతకు ముందు తమ పార్టీ డిమాండ్లు చాలా ఉన్నాయని, అయితే బిల్లు రావడం కీలకం కాబట్టి , కొన్నింటిని వదులుకోవల్సి వస్తోందన్నారు. ఎఐఎంఐఎం నేత, ఎంపి అసద్దుదిన్ ఒవైసీ స్పందిస్తూ ఒబిసిలు, ముస్లింలకు ఇందులో కోటా అవసరం అన్నారు. ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి బిల్లు సరైనది కానీ ఇందులో డిలిమిటేషన్, సెన్సస్ ప్రక్రియతో ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు.

నేటి నుంచి లోక్‌సభలో చర్చ…21న రాజ్యసభలో బిల్లు
మంగళవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత సభ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం చర్చ ఉంటుంది. తరువాత బిల్లు ఆమోదానికి ఓటింగ్ జరుగుతుంది. తరువాత బిల్లును ఈ నెల 21న రాజ్యసభలో ప్రవేశపెడుతారు. అక్కడ కూడా ఆమోదం పొందితే బిల్లు పార్లమెంట్ సమ్మతి దక్కి , మహిళలకు చట్టసభలలో కోటా అమలుకు చట్టబద్ధత దక్కుతుంది. ఇప్పుడు తీసుకువచ్చిన మహిళా బిల్లు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పూర్తి స్థాయి కొత్త బిల్లు అని, ఇంతకు ముందు రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగ సవరణల బిల్లుగా దీనిని తీసుకువచ్చినట్లు తెలిపారు. కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీనికి పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం అవసరం అని, ఇది దక్కుతుందని ఆశిస్తున్నామని న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ తెలిపారు.

మహిళా బిల్లు తొలిసారిగా దేవెగౌడ హయాంలో..
నిజానికి మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో 1996లో హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని అప్పటి యునైటెడ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాత దీనిని వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు. కానీ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందలేదు. అయితే చివరికి ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. 2014లో లోక్‌సభ రద్దు తరువాత అక్కడ బిల్లుకు కాలం చెల్లినట్లు అయింది. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తరువాత మహిళా బిల్లును ఇప్పుడు మోడీ సర్కారు తీసుకువచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News