Saturday, May 4, 2024

మంచిదే, కాని..

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ, శాసన సభల స్థానాలలో మహిళలకు రిజర్వేషన్ల కల్పనకు 128వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ద్వారా అత్యంత కల్లోలిత జలాల్లో తన నావ మునిగిపోకుండా వరుసగా మూడోసారి సురక్షితంగా తీరానికి చేరుకోగల ఏర్పాటును కేంద్ర పాలక పక్షం భారతీయ జనతా పార్టీ చేసుకోగలిగింది. చట్ట సభల్లో మహిళలకు మూడింట ఒక వంతు స్థానాలను కేటాయించే చట్టం వచ్చి తీరాలని దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు చిరకాలంగా కోరుకొంటున్నాయి కాబట్టి ఈ బిల్లు నిరాటంకంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్నీ పొందగలదు.

హిందీలో నారీశక్తి వందన అధియాన్ అని పిలుస్తున్న ఈ బిల్లు ప్రవేశంతో కొత్త భవనంలో పార్లమెంటు మొదటి సారిగా కొలువు దీరడం బాగుంది. కొత్తగా ముస్తాబై వచ్చిన చట్టం లో జనరల్ మహిళలతో బాటు ఎస్‌టి, ఎస్‌సిలకు ఉప కోటా కల్పించనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి లోక్‌సభలో, శాసన సభల్లో ఉన్న స్థానాల్లోనే మహిళలకు కోటా కల్పించదలచినట్టు, వంతులవారీగా వాటిని వారికి ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. మొదటి నుంచి స్త్రీకి ద్వితీయ శ్రేణి పౌరసత్వాన్నే కట్టబెట్టిన దేశం మనది.

ఆర్ధికంగా అస్వతంత్రురాలిని, నిరక్షరాస్యురాలిని చేసి నిర్ణయాలు తీసుకొనే స్తోమత బొత్తిగాలేని స్థితిలో పురుషుడు ఆడించినట్టల్లా ఆడే యంత్రంగా మార్చినందు వల్ల మహిళ పరిస్థితి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలతో సమానమైన స్థాయికే పరిమితమైంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చింది గాని ఆమె స్థితిగతుల్లో మార్పు రాలేదు. చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ అది ఆమెకు ఎండమావిగానే కొనసాగుతున్నది. అందుచేత అవకాశాల్లో మహిళలకూ రిజర్వేషన్లు కల్పించవలసిన అగత్యం తలెత్తింది. ప్రజాప్రాతినిధ్య స్థానాల్లో అంటే ఎన్నుకొనే సంస్థల్లో స్త్రీలకు రిజర్వేషన్ల కల్పన ఆలోచన మొదటిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును 1989లో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో విఫలమైంది.ఈ యత్నానికి కొనసాగింపుగా ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో అంటే పంచాయతీ రాజ్, మునిసిపల్ సంస్థల్లో మహిళలకు 33% స్థానాలను ప్రత్యేకిస్తూ ప్రవేశపెట్టిన 72, 73 రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు ఉభయసభల ఆమోదాన్ని పొంది చట్టాలయ్యాయి. వాటి ప్రభావంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం మహిళలు పార్లమెంటులో 15% వరకు వున్నప్పటికీ శాసనసభల్లో వారి ప్రాతినిధ్యం 10 శాతానికి మించలేదని గణాంకాలు చెబుతున్నాయి.

దేశాభివృద్ధి కృషిలో మరింతగా మహిళలు పాలు పంచుకోవాలన్న ఆకాంక్షతో ఈ బిల్లును తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ప్రతిపాదిస్తూ ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విధాన నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం వహించేలా ఈ బిల్లు దోహదం చేస్తుందని, తద్వారా 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఇంత అట్టహాస ఆర్భాటమూ మహిళకు చట్టసభల్లో తక్షణమే రిజర్వేషన్లు కల్పించబోవడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇవి అమలు కాబోవు. నియోజక వర్గాల పునర్విభజన జరగవలసి ఉన్నందున 2026 తర్వాతనే అంటే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మాత్రమే ఇది వాస్తవ రూపం ధరిస్తుంది.

అంతేకాదు అణగారిన వర్గాల్లో, బహుజనుల్లో అధిక సంఖ్యాకులు, సామాజికంగా, వృత్తి గ్రామీణంలో విస్తృతంగా వున్న వెనుకబడిన తరగతులకు ఉప కోటా లేకపోడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నలోపం. అందుచేత ఈ బిల్లులో సమగ్రత సంపూర్ణత లోపించాయి. బిల్లు చట్టమై అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు పాటు మాత్రమే ఉనికిలో ఉంటుంది. ప్రస్తుతం చట్టసభల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఎస్‌సి, ఎస్‌టి ప్రతినిధులు తమతమ పార్టీల నాయకత్వాల చెప్పుచేతల్లోనే నడుచుకొంటున్నారని, స్వతంత్రంగా తమ వర్గాల ప్రజల కోసం పని చేయలేకపోతున్నారనే విమర్శ ఉంది. రిజర్వేషన్ చట్టం ద్వారా శాసన సభల్లో ప్రాతినిధ్యం పొందే మహిళల పరిస్థితీ అంతకు మించబోదు.

ఎన్నికలు అడ్డంగా కోట్లు సంపాదించి కుమ్మరించగలిగే వారి కొంగు బంగారం అయిపోయినందున లోక్‌సభ, శాసనసభల రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయడానికీ అపారమైన డబ్బు అవసరమవుతుంది. అందువల్ల పేద, అణగారిన, శ్రామికవర్గ మహిళలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు పరిమితంగానే ఉంటాయి.కీలకమైన ఎన్నికలవేళ పొదిలో అస్త్రాలు లేని కరువును ఎదుర్కొంటున్న బిజెపి ఇటీవల వంట గ్యాస్ ధరను ఉన్నపళంగా రూ. 200 తగ్గించినా ప్రయోజనం కనిపిస్తున్నట్టు లేదు. బిల్లును చట్టం చేయించడం అనేది ముఖ్యం. ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఏదో ఒక స్థాయిలో సాకారం కానుండడం హర్షదాయకం. ఆకాశంలో సగానికి అదనంగా ఏ మాత్రం వెలుగు లభించినా సంతోషమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News