పాత ఉద్యమకారులంతా ఒక్కటైతే మన పవర్ ఏందో తెలంగాణ సమాజానికి తెలుసని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్పీ మల్కాజిగిరి ఇన్‌ఛార్జ్ అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు మాజీ ఎంపీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఆనాడు అందరం ఉద్యమంలో పని చేశామని రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్‌గా నిలిచామని అన్నారు. ఇప్పుడు మనందరి మందు ఉన్న లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించుకోవడమేనని తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, యువత, ఆడబిడ్డలు అందరూ బాగుండాలన్నారు.
ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పెట్టుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారుల పునరేకీకరణ జరుగుతోందని, పాత శక్తులంతా ఒక్కటైతే మన పవర్ ఏందో తెలంగాణ సమాజానిక తెలుసని అన్నారు. పాండురంగా రెడ్డి అన్న డెడికేషన్ గురించి తెలంగాణ మొత్తం తెలుసని, ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయని, ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నాటి ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య చనిపోతే పాండురంగా రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారని గుర్తు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతిలో చేరడం సంతోషమని అన్నారు. ఇలాంటి శక్తులు మనకు ఒక్కో జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారని, వారందరికీ ఓపెన్ హార్ట్‌గా వెల్కమ్ చెబుతున్నానని తెలిపారు.
ఉద్యమకారులు కూడా ఉద్యమకారుల ఫోరమ్ పేరుతో పని చేసేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. కళా కారులు కూడా తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరుతున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలవడమే జాగృతి ప్రధాన లక్ష్యమని, కుత్బుల్లాపూర్‌లో హైడ్రా నిరుపేదల ఇళ్లు కూల్చితే మొదట వారికి మద్దతుగా నిలిచింది జాగృతేనని అన్నారు. జాగృతిలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కవిత తెలిపారు.
Also Read: వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త సిలబస్