శనివారం ఇక్కడి ఆరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య టీమిండియా ఇన్నింగ్స్ 47 ఓవర్లలో 369 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా, రెండో వన్డేలో టీమిండియా జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో ఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. చివరికి ఆస్ట్రేలియాకు విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు అలీసా హీలీ 18 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 30,
జార్జియా వొల్ 68 బంతుల్లో 14 ఫోర్లతో 81 పరుగుల చేశారు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బేథ్ మూని 75 బంతుల్లోనే 23 ఫోర్లు, ఓ సిక్స్‌తో 138పరుగులు సాధించింది. ఎలిసె పెరీ (68) తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా చివరి వరకు విజయం కోసం పోరాడింది. అయితే కీలక సమయంలో వికెట్లను కోల్పోవడంతో విజయానికి 43 పరుగుల దూరంలో నిలిచి పోయింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 63 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 125 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 8 బౌండరీలతో 52, దీప్తి శర్మ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 బంతుల్లోనే 72 పరుగులు సాధించారు. అయితే కీలక సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకున్నారు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
మంధాన అరుదైన రికార్డు
వన్డేల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీతో నయా చరిత్ర
ఆస్ట్రేలియా మహిళలతో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అరుదైనరికార్డును సృష్టించింది. మహిళల వన్డే ఫార్మాట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంధాన 50 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మహిళల వన్డేల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించింది. ఇదే సమయంలో 50 బంతుల్లోనే సెంచరీని సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మంధాన 63 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 125 పరుగులు చేసింది. కాగా, మహిళల వన్డేల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతోంది. లానింగ్ 45 బంతుల్లోనే వన్డేల్లో శతకం సాధించింది.
Also Read: స్టేషన్ ఘన్‌పూర్‌లో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు?: తాటికొండ రాజయ్య