Friday, May 3, 2024

సుమిత్ నగాల్ సంచలనం

- Advertisement -
- Advertisement -

31వ సీడ్ బబ్లిక్‌కు షాక్,  స్వియాటెక్, రిబకినా ముందంజ
రెండో రౌండ్‌లో పెగులా, జ్వరేవ్, అల్కరాజ్
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెను సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ నగాల్ కజకిస్థాన్‌కు చెందిన 31వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్‌పై సంచలన విజయం సాధించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో నగాల్ 64, 62, 76 (7/5) తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే నగాల్ దూకుడుగా ఆడాడు. అద్భుత ఆటతో ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న అలెగ్జాండర్‌ను హడలెత్తించాడు.

అతని ధాటికి బబ్లిక్ ఎదురు నిలువలేక పోయాడు. చూడచక్కని షాట్లతో అలరించిన నగాల్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. తర్వాతి సెట్‌లో మరింత దూకుడుగా ఆడాడు. ఈసారి బబ్లిక్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. అద్భుత ఆటతో అలరించిన నగాల్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం నగాల్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.

ఈసారి బబ్లిక్ అద్భుత ఆటను కనబరిచాడు. నగాల్ జోరుకు బ్రేక్ వేస్తూ ముందుకు సాగాడు. కానీ భారత ఆటగాడు సుమిత్ కూడా గట్టిగా పోరాడాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకుని రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మూడున్నర దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిని భారత క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. 1989లో రమేశ్ కృష్ణన్ అప్పటి ప్రపంచ నంబర్‌వన్ మ్యాట్స్ విలాండర్‌ను మట్టి కరిపించాడు.

అల్కరాజ్ ముందుకు..
మరోవైపు రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 8వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్) తదితరులు కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), మూడో సీడ్ ఎలెనా రిబకినా (కజకిస్థాన్), ఐదో సీడ్ జెసికా పెగులా (అమెరికా), 11వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా), 12వ సీడ్ జెంగ్ (చైనా) తదితరులు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి రిబకినా మొదటి రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో రిబకినా 76, 64 తేడాతో కరోలినా ప్లిస్కోవా (చెక్)ను ఓడించింది. పెగులా 62, 64తో మరినో (కెనడా)పై విజయం సాధించింది. జెంగ్ 36, 62, 63 తేడాతో క్రుగర్ (అమెరికా)ను, ఒస్టాపెంటో 75. 61తో బిర్రెలి (ఆస్ట్రేలియా)ను ఓడించి ముందంజ వేశారు. టాప్ సీడ్ స్వియాటెక్ 76, 62 తేడాతో సోఫియా (కెనిన్) అమెరికాను కంగుతినిపించింది. ఇతర పోటీల్లో 16వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), 27వ సీడ్ నవ్వారో (అమెరికా) తదితరులు విజయం సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News