Sunday, December 15, 2024

హిందూ నేత చిన్మయ్ కృష్ణకు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

రాజద్రోహం అభియోగాలపై స్వామి అరెస్టు
ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనల వెల్లువ
ఢాకా: రాజద్రోహం అభియోగాలపై అరెస్టు అయిన ప్రముఖ హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి బంగ్లాదేశ్‌లో ఒక కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించి, ఆయనను జైలుకు పంపింది. దీనితో రాజధాని ఢాకా, రేవు నగరం ఛట్టోగ్రామ్ సహా వివిధ ప్రదేశాల్లో హిందు సమాజం సభ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హిందూ గ్రూప్ సమ్మిళిత సనాతని జోతె నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఛట్టోగ్రామ్‌కు వెళుతుండగా ఢాకాలోని హజ్రత్ షాహ్‌జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో నుంచి బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఆ తరువాత ఛట్టోగ్రామ్‌కు తీసుకువెళ్లారు.

దాస్ అరెస్టు పట్ల నిరసన సూచకంగా న్యాయవాదులతో సహా అనేక మంది ఆయన మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా గట్టి భద్రత మధ్య ఆయనను కోర్టుకు తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోర్టు ప్రాంగణంలో సమీకృతమైన దాస్ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, ఆయన ముకుళిత హస్తాలతో వారికి నమస్కారం చేసి, ఆ ప్రదేశంలో మతపరమైన నినాదాలు చేయవద్దని వారిని కోరారు. విచారణ సమయంలో దాస్ డిఫెన్స్ న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నవారు తమకూ అటువంటి అరెస్టు వారంట్లు జారీ చేయవలసిందిగా ఛట్టోగ్రామ్ ఆరవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కాజీ షరీఫుల్ ఇస్లామ్‌కు విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి అందుకు స్పందనగా, ‘ఆయన కోసం మీ మనోభావాలను గౌరవిస్తాను’ అని చెప్పారు.

అటు పిమ్మట ఇస్లామ్ విచారణను కొద్ది సేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి మొదలైన తరువాత పరిశీలన నిమిత్తం బెయిల్ దరఖాస్తు సమర్పించవలసిందని ఆయన న్యాయవాదులను కోరారు. ఆ సమయంలో దాస్ కూడా ఒక ప్రకటన చేశారు. వాదనలు ముగిసిన తరువాత దాస్ బెయిల్ పిటిషన్‌ను ఇస్లామ్ తిరస్కరించారు. దాస్‌ను రేవు నగరం వెలుపల నుంచి అరెస్టు చేసినందున చట్టం ప్రకారం ఆయనను 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచవలసి ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. కోర్టు ఆ తరువాత దాస్‌ను జైలుకు తీసుకవెళ్లాలని ఆదేశించింది. జైలు నిబంధనావళి ప్రకారం హిందూ స్వామిని తన మతాచారాలు పాటించేందుకు అనుమతించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోర్టు ఉత్తర్వు వెలువడిన వెంటనే దాస్ అనుయాయులు నిరసన వ్యక్తం చేయసాగారు. వారు ఆయన ప్రయాణించే జైలు వ్యాన్ కదలికను అడ్డుకున్నారు.

నిరసనకారులు ఆయన విడుదల కోరుతూ నినాదాలు చేశారని ‘ది డైలీ స్టార్’ పత్రిక తెలియజేసింది. వ్యాన్‌కు మార్గాన్ని సుగమం చేయడానికి నిరసనకారులపై పోలీసులు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) సభ్యులు ధ్వని గ్రనేడ్లు ప్రయోగించి, బ్యాటన్లు ఝళిపించారు. వ్యాన్ తుదకు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో కోర్టు ప్రాంగణం నుంచి వెళ్లగలిగిందని ఆ పత్రిక తెలిపింది. ప్రశాంతంగా ఉండవలసిందిగా దాస్ జైలు వ్యానులో నుంచే తన అనుయాయులకు పిలుపు ఇచ్చారు. ‘మనం దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మనం సనాతనులం రాష్ట్రంలో అంతర్భాగం& రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు,శాంతియుత సహజీవనాన్ని ధ్వంసం చేసేందుకు మనం ఏమీ చేయబోం. మనం మన భావోద్వేగాల నియంత్రణ ద్వారా శాంతియుత నిరసన నిర్వహించి, వాటిని మన బలంగా మార్చుకుందాం’ అని దాస్ అన్నట్లు ఆ పత్రిక తెలియజేసింది. దాస్‌ను తీసుకువెళుతున్న జైలు వ్యాను చుట్టూ భారీ సంఖ్యలో చేరిన జనంలో స్వాములు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆన్‌లైన్ పోర్టల్ ‘బిడిన్యూస్24’ తెలిపింది.‘జై శ్రీరామ్’, ‘మేము మా హక్కులు కోరాం కానీ జైలు శిక్ష పొందాం’, ‘ఒకటి రెండు మూడు నాలుగు, అవన్నీ మోసాలే’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. వారిలో కొందరు శంఖ నాదాలు కూడా చేసినట్లు ఆ వార్త తెలిపింది. దాస్ విడుదల కోరుతూ ఢాకా, ఛట్టోగ్రామ్, కుమిల్లా, ఖుల్నా, దినాజ్‌పూర్, కాక్సస్ బజార్ సహా వివిధ జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తినట్లు అది తెలియజేసింది.

దాస్ తక్షణ విడుదల కోరుతూ హిందు సమాజం నుంచి వందలాది మంది ప్రజలు సోమవారం ఛట్టోగ్రామ్‌లో చేరాగి పహర్ కూడలి వద్ద వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ కూడా దాస్ అరెస్టును నిరసించి, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరింది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) నేత ఒకరి ఫిర్యాదును పురస్కరించుకుని దాస్, మరి 18 మందిపై అక్టోబర్ 30న ఛట్టోగ్రామ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు దాఖలైంది, వారు అక్టోబర్ 25న హిందూ సమాజం ర్యాలీ సమయంలో ఛట్టోగ్రామ్‌లోని లాల్దిఘి మైదాన్‌లో జాతీయ పతాకాన్ని అవమానించారని ఆరోపించడమైంది. ఏ సమాజం నేతగా కాకుండా రాజద్రోహం నేరానికిగాను దాస్‌ను అరెస్టు చేసినట్లు స్థానిక ప్రభుత్వ వ్యవహారాల సలహాదారు, వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం నేత ఆసిఫ్ మహ్మూద్ తెలిపారు.

మహ్మూద్ మంగళవారం వాయవ్య రంగ్‌పూర్ నగరంలో ఒక బహిరంగ ర్యాలీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజద్రోహం వంటి ఏ ఘటనకైనా ఒకరు పాల్పడితే అతనిని వదిలేది లేదని చెప్పారు. దాస్ ఇస్కాన్‌లో కూడా సభ్యుడు. కానీ ఆ సంస్థ ఆయనను ఇటీవల బహిష్కరించింది. కాగా, దాస్ అరెస్టుపై వ్యాఖ్యానించేందుకు బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ నేతలు ఎవరూ వెంటనే అందుబాటులో లేరు. ఇదిఇలా ఉండగా, దాస్ అరెస్టు, బెయిల్ నిరాకరణ పట్ల భారత్ మంగళవారం ‘తీవ్ర ఆందోళన’ వ్యక్తం చేసింది. హిందువులకు, అందరు మైనారిటీలకు రక్షణ, భద్రత ఉండేలా చూడాలని భారత్ బంగ్లాదేశీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల జనాభాలో దాదాపు 8 శాతం మాత్రమే ఉన్న మైనారిటీ హిందువులు ఆగస్టు 5న షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం దరిమిలా 50 పైగా జిల్లాల్లో 200 పైగా దాడులు ఎదుర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News