బీహార్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, దీన్ని రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోపాలను సరిదిద్దకుండా జాబితాను ప్రచురించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఇరవై ఏళ్లలో వేగవంతమైన పట్టణీకరణ, వలసల కారణంగా ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయని ఎన్నికల కమిషన్ చెబుతోంది. అందుకనే వేరే రాష్ట్రాలకు వెళ్లిన వలసజీవులను ఓటర్ల జాబితాల్లోంచి తొలగించడం సవాలుగా మారింది. వలసదారులు తమ పుట్టిన/ పెరిగిన స్థలంలో తమ ఓటు హక్కును తమకు నచ్చిన విధంగా వినియోగించుకుంటారని, అందుకే వలసల సాకుతో ఓటర్ల జాబితాల్లోంచి వారి పేర్లను తొలగించరాదన్న డిమాండ్ వినిపిస్తోంది. బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను ఎన్నికల కమిషన్ తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ ఓటర్ల వివరాలను ఈ నెల 9 లోగా అందజేయాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నెల ఒకటిన ఈ ముసాయిదా విడుదలైంది. సవరణ ప్రక్రిలో (editing process) భాగంగా ఓటరు నమోదు పత్రాన్ని పూరించి అందజేసిన 75% మంది ఓటర్లలో చాలా మంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేయలేదని, బూత్ స్థాయి అధికారుల సిపార్సుతో ముసాయిదా జాబితాలో వారి పేర్లను చేర్చారన్న ఆరోపణలు ఉన్నాయి, అయితే ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుషులు కన్నా మహిళల ఓటర్లనే ఎక్కువ శాతం తొలగించినట్టు బయటపడింది. ఈ ఏడాది జనవరిలో తయారు చేసిన ఓటర్ల జాబితా కంటే 25 లక్షల పురుష ఓటర్లు తక్కువై తాజాగా మొత్తం 3.82 కోట్ల పురుష ఓటర్లతో జాబితా తయారైంది.
అలాగే గతంలో కన్నా 31 లక్షల మహిళా ఓటర్లు తక్కువై తాజాగా మొత్తం 3.41 కోట్ల మహిళా ఓటర్లతో జాబితా తయారైంది. వాస్తవానికి బీహార్‌లోని మొత్తం 38 జిల్లాల్లోని 37 జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించడమైంది. గోపాల్‌గంజ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య జనవరిలో 10 లక్షలవరకు ఉండగా, ఇప్పుడు 8.21లక్షలకు తగ్గింది. అంటే 17.8 శాతం క్షీణత కనిపించింది. పురుష ఓటర్లను పోల్చి చూస్తే 10.37 లక్షల నుంచి 9.23 లక్షలకు పురుష ఓటర్ల సంఖ్య తగ్గింది. 11% క్షీణత కనిపించింది. అంటే పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6.8% ఎక్కువగా తొలగింపబడ్డారు. మిగతా జిల్లాల కన్నా గోపాల్‌గంజ్ జిల్లాలోనే ఎక్కువగా జరిగింది. ఓటర్ల తొలగింపులో లింగ విభజన చోటు చేసుకోవడం అనేక ప్రశ్నలను లేవదీస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ ఆగస్టు జాబితాలో చేరని ఓటర్లు చనిపోవడం లేదా అనేక ప్రాంతాల్లో నమోదు కావడం లేదా శాశ్వతంగా బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు వలస పోవడం లేదా ఆచూకీ లేకపోవడం కానీ జరిగి ఉంటుందని చెబుతోంది.
మరణాల రేటు స్త్రీ, పురుష ఓటర్లలో ఒకేలా ఉంది. గత ఐదేళ్లలో బీహార్‌లో స్త్రీ, పురుష మరణాల రేటును పరిశీలిస్తే కరోనా మహమ్మారి సమయంలో కాస్త పురుషుల మరణాలు అధికంగా ఉన్నాయి తప్ప మిగతా కాలమంతా స్త్రీ, పురుష మరణాల రేటు ఇంచుమించు సమానంగా ఉంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్ల తొలగింపునకు డూప్లికేట్ ఎంట్రీలు లేదా దొరకని చిరునామాలు కారణంగా కనిపిస్తోంది. మరో ముఖ్యమైన అంశం బీహార్ నుంచి వలసలు, వ్యక్తిగత ఆధారాల డేటా పరిశీలిస్తే మహిళల కన్నా పురుషుల వలసలే ఎక్కువ. 202021 లో దేశంలో ప్రతి 100 పురుష వలస జీవుల్లో 31.4 శాతం మంది వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అని తెలిసింది. 65.6 శాతం మంది అదే రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్లినట్టు బయటపడింది. దీనికి భిన్నంగా ప్రతి 100 మహిళా వలసజీవుల్లో 7.2 శాతం మంది మాత్రమే బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లినట్టు తేలింది. 92.6 శాతం మంది అదే రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లినట్టు బయటపడింది. బీహార్ విషయంలో ఇది వాస్తవం అయినా ఆ రాష్ట్ర పురుషులకు మరింత తీవ్రంగా ఉండవచ్చు.
బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉండగా, ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగింపబడడానికి కారణం ఏమిటి? మరో ముఖ్యమైన విషయం మరణాల రేటులో కూడా పురుషులు, మహిళల మధ్య తేడా అంతగా లేదు. (మరణాల రేటుకు నిర్వచనం.. ఒక నిర్దిష్ట ప్రాంతం, ఒక కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాలో సంభవించే మరణాల సంఖ్య) మరి జాబితాల్లోంచి మహిళా ఓటర్లనే ఎక్కువగా తొలగింపబడడానికి ఒకటే కారణం చెబుతున్నారు. సవరణ ప్రక్రియ సందర్భంగా ఓటరు నమోదు పత్రాల సమర్పణలో పురుషులు, మహిళల మధ్య తేడా కనిపించిందని అంటున్నారు. 201921 వివరాల ప్రకారం బీహార్‌లో పురుషులతో పోలిస్తే కేవలం 55 శాతం మహిళలే అక్షరాస్యులు కాగా, పురుషుల్లో 76 శాతం మంది అక్షరాస్యులు.
దేశం మొత్తంమీద మహిళా అక్షరాస్యత బీహార్‌లో అథమస్థానంలో ఉంది. తక్కువ అక్షరాస్యత కారణంగానే మహిళలు అధికశాతం ఓటరు నమోదు పత్రాలను నింపడం కానీ, వాటిని సమర్పించడం కానీ చేయలేకపోయినట్టు విశ్లేషణలో బయటపడింది. పోలింగ్‌లో ఓట్లువేయడానికి ఎక్కువగా పోటెత్తే మహిళలున్న జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా నమోదైనప్పటికీ, అక్కడ మహిళా ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం గమనార్హం. ఈ జిల్లాలనుంచి వలసవెళ్లిన పురుషుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, మహిళల ఓటర్ల తొలగింపు కావడం చర్చనీయాంశం అవుతోంది. దీన్నిబట్టి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో స్వీయగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) మహిళలపై ముఖ్యంగా అక్షరాస్యులు కాని వారిపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా జాబితాల్లోంచి ఎక్కువ మంది మహిళలు అదృశ్యం కావడానికి దారితీస్తుంది.