Tuesday, August 5, 2025

కెసిఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా.. వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుంది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గొంతు తడపడానికే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మించారని, మీడియాను అడ్డుపెట్టుకుని ఎంత బురద జల్లినా భవిష్యత్తులో నిజం ప్రజల ముందు ఉంటుందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సైట్ మార్చడం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఘోష్ కమిషన్ నివేదికను యథాతథంగా ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. కమిషన్ ఇచ్చిన నివేదిక అనేది ఫైనల్ కాదు అని, దాని మీద కోర్టుకు వెళ్లవచ్చు అని కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోనే ఉందన్న విషయం కూడా తెలుసుకోవాదని సూచించారు. కెసిఆర్ మీద నిందలు మోపడానికి 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దురుద్దేశం, దుర్బుద్ధితో నాడు నాగార్జునసాగర్ సైట్ మార్చి శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు.

కాంగ్రెస్ పాపం మూలంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా గొంతుకోశారని మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు అని, అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారని అన్నారు. పచ్చబడ్డ తెలంగాణను చూసి ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారని, తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని ఆరోపించారు. బనకచర్లను నీళ్లను మలిపేందుకే కాళేశ్వరం మీద కక్ష గట్టారని, అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News