Friday, May 17, 2024

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తరచూ సభలు నిర్వహిస్తూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్పెషల్ ఫోకస్ మాత్రం మహారాష్ట్రపైనే ఉన్నట్లు తెలుస్తోంది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారినప్పటి నుంచే మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బిఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూరే సరైన వేదిక అని తొలి నాళ్లలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చెప్పేవారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్‌ఖేడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.

తెలంగాణ అభివృద్ధిని గమనిస్తున్న మహారాష్ట్ర పౌరులు
తెలంగాణకు ఆనుకుని ఉన్న నాందేడ్ నుంచి మొదలుపెట్టి.. మహారాష్ట్రను ప్రభావితం చేసేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీకి ఉన్న పరిధిని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్రలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను మహారాష్ట్ర రాష్ట్ర పౌరులు గమనిస్తున్నారు. అందుకే ముందుగా నాందేడ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. మహారాష్ట్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఒకప్పుడు తెలంగాణలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు దాదాపు ఒకేలా ఉన్నాయి. తద్వారా ఇక్కడి రైతులకు అందుతున్న

సౌకర్యాలు మనమూ పొందగలం అనే భావన మహారాష్ట్ర రైతుల్లో ఉండటంతో బిఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందుకే పార్టీని ముందుగా మహారాష్ట్రలో బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించారు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన భారీ పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు వెళ్లి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పెరుగుతున్న ఆదరణ
బిఆర్‌ఎస్ పార్టీలో మహారాష్ట్ర క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్రలో పర్యటించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి 14న కాంధార్ లోహాలో బహిరంగ సభలు నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్‌లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. జూన్ 26,27 తేదీలలో రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించి,సర్కోలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రసంగించారు. మహారాష్ట్రలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదనే ఆలోచన ప్రజల్లో కలిగించాలని అక్కడి నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేస్తూ క్రమంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

ఆగస్టు 1న మహారాష్ట్రకు కెసిఆర్
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా వార్వా తహశీల్ వాటేగావ్ గ్రామంలో జరిగే అన్నాభౌ సాఠే 103వ జయంతి ఉత్సవాల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పాల్గొంటారు. అన్నాబావ్ సాఠే స్మృతి దివస్‌లో పాల్గొన్న తరవాత బిఆర్‌ఎస్ అధినేత అక్కడి నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తరువాత ఆయన సాంగ్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్‌కు చేరుకుని, అక్కడ కొలువైన మహాలక్ష్మిఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణ శకం 7వ శతాబ్దంలో చాళుక్య వంశ రాజు కరణ్ దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలోని 108 శక్తి పీఠాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మిఆలయం ఒకటి. కొల్హాపూర్లో దేవీ అంబాబాయి దర్శనం తరవాత కెసిఆర్ ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News