Thursday, April 25, 2024

సిఎఎ, ఎన్‌ఆర్‌సి ముస్లింలకు వ్యతిరేకం కాదు

- Advertisement -
- Advertisement -

CAA NRC

 

హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) భారత ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం సమాజంతో పాటు దేశంలోని ఇతర మైనారిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల పనితీరుపై ఆయన సోమవారం నాడిక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

గడచిన 5 ఏళ్లలో (2014….20-19) రూ. 2, 918 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి జాతీయ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.1,230 కోట్లు కేటాయించినట్లు, పిఎం సడక్ యోజనకు రూ.2,457 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 23 జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం గుండా వెలుతున్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 2. 85 లక్షల మంది ఎస్‌సి విద్యార్థులకు, 5.15 లక్షల మంది ఒబిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్కాలర్‌షిప్‌ల కోసం దాదాపు రూ. 2100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై, తెలంగాణలోని ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థుల ఉపకార వేతనాల అమలుపై తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికారులతో కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్ అథవాలే సమీక్షా సమావేశం నిర్వహించారు.

పాత్రికేయుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది….
నగరంలోని ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో జరిగిన అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ( ఎడబ్లూజెఎ) 2 వ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అత్వాలే అన్నారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అవసరమైన భూమిని సేకరించవల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేకంగా తాను ఒక లేఖ రాసి,పాత్రికేయుల సంక్షేమానిని కృషి చేస్తానన్నారు. జర్నలిస్టులను రక్షించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసిందని, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇలాంటి చట్టాలను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకురావాలని అత్వలే విజ్ఞప్తి చేశారు.

వివిధ కార్యక్రమాలు చేపట్టి, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఎడబ్లూజెఎ జాతీయ అధ్యక్షుడు కోటేశ్వర్ రావు కృషిని మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, పాత్రికేయుల ఉద్యోగ భద్రత మరియు సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ఆరోగ్యం, పాత్రికేయుల పిల్లలకు సంబంధించిన విద్యా పథకాలు గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఎఫ్‌సిసి అధ్యక్షుడు ఎస్.వెంకట్ నారాయణ్ , జాతీయ బిసి చైర్మన్ ఎస్.భగవన్ లాల్ సాహ్నితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

CAA NRC is not anti-Muslim
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News