Monday, May 13, 2024

టీకా తీసుకుంటే రూ.840 కోట్ల జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

California cash prize for Vaccination

వ్యాక్సినేషన్ ప్రోత్సాహానికి కాలిఫోర్నియా కొత్త చిట్కా

కాలిఫోర్నియా : కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి… 116 మిలియన్ డాలర్లు (సుమారు రూ.840 కోట్లు ) నగదు బహుమతి పొందండి అని ప్రకటించింది అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం. ఈమేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గేవిన్ న్యూసమ్ కీలక ప్రకటన చేశారు. ఎందుకంత భారీ మొత్తాన్ని ప్రకటించారంటే కాలిఫోర్నియాలో వచ్చేనెల 15 నుంచి కరోనా ఆంక్షలు ఎత్తివేయనున్నారు. అందుకని టీకా ప్రక్రియను మరింత వేగంగా, ముమ్మరంగా సాగించాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. 34 మిలియన్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఇంతవరకు 63 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. మిగిలిన 12 మిలియన్ల మంది టీకా మొదటి డోసు తప్పనిసరిగా తీసుకునేలా ప్రోత్సహిస్తూ ఈ కొత్త చిట్కా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

కనీసం తొలి డోసైనా తీసుకుంటే ఈ ప్రైజ్‌మనీ పొందడానికి అర్హులౌతారు. జూన్ 4తో ప్రారంభమయ్యే ఈ లక్కీ డ్రాలో పదిమందికి 1.5 మిలియన్ డాలర్లు (రూ,.10.86 కోట్లు) మరో 30 మందికి 50 వేల డాలర్లు (రూ.36.21 లక్షలు),వంతున నగదు బహుమతి అందిస్తారు. అలాగే 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3600 ) విలువైన గిఫ్ట్ కార్డులు ఇస్తారు. ఇప్పటికే ఒహియో, కొలరాడో, న్యూయార్క్, ఒరెగా, న్యూజెర్సీ, తదితర రాష్ట్రాలు ఇదే విధంగా టీకాకు ఆఫర్ ప్రకటించాయి. ఒహియో ‘వ్యాక్స్ ఎ మిలియన్ ’ పేరిట పోటీ నిర్వహిస్తూ విజేతలకు ఒక మిలియన్ డాలర్లు నగదు బహుమతిగా ప్రకటించింది.న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి డోసు వేసుకున్న వారికి ఉచిత బీరు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇక న్యూయార్క్ 12 నుంచి 17 ఏళ్ల విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి స్కాలర్‌షిప్ ఇస్తామని ప్రకటించింది. అమెరికాలో కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్న యువతకు డేటింగ్ యాప్స్‌లో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేలా వైట్‌హౌస్ చర్యలు తీసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News