Wednesday, September 24, 2025

గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దుపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మెరిట్ లిస్ట్ రద్దుపై హైకోర్టు స్టే విధిస్తూ చీఫ్ జస్టీస్ ధర్మాసనం బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో టిజిపిఎస్‌సికి భారీ ఊరట లభించినట్లు అయింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని, లేకుంటే ఆ పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పుఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. అందులో భాగంగా టిజిపిఎస్‌సి హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల మొత్తం అందరిని శిక్షించడం సబబు కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం నిశితంగా పరిశీలించింది. ఈ కేసు తీర్పులో వినియోగించిన పదాలు, చేసిన వ్యాఖ్యల పట్ల ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యువేషన్ చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యువేషన్ అనేది సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉంటుందే తప్ప రీ వాల్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని వివరించగా, ఈ క్రమంలో హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. టిజిపిఎస్‌కు ఇంటిగ్రిటీ లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌లో ఉందని పేర్కొంది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని, మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటివి ఏమైనా జరిగాయా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

సింగిల్ జడ్జి తీర్పులో చాలా సున్నితమైన పదాలు ఉపయోగించారని హైకోర్టు అభిప్రాయపడింది. బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని, బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా? వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదా? 2014 నుండి అసలు గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ జరగలేదా? 2014 నుండి టిజిపిఎస్‌సి ఎక్స్‌టెన్షల్‌లో ఉందా? వంటి పలు ప్రశ్నలు సంధించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షక్షలకు వేరువేరు హాల్‌టికెట్లు జారీ చేయడాన్ని సింగిల్ బెంచ్ తీర్పులో తప్పుబట్టారని ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ కోఠి మహిళా వర్సిటీలో పురుషులకు మూత్రశాలలు లేవని అందుకే ఆ రెండు కేంద్రాలను మహిళలకే కేటాయించామని ఏజీ తెలిపారు. దివ్యాంగులకు సమీపంలో ఉన్న కేంద్రాలను కేటాయించామన్నారు. హాల్‌టికెట్ల జారీ విషయంలో టిజిపిఎస్‌సికి అధికారం ఉందని చెప్పగా, పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమని సిజె పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం మూల్యాంకనం జరగలేదని ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదుల వాదన పట్ల స్పందించిన సిజె జవాబు పత్రాలు చూడకుండా మూల్యాంకనం సరిగ్గా జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సిజె జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తేల్చి చెప్పారు. న్యాయస్థానం స్టే విధించడంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది.

Also Read: ఆర్‌టిసిలో ఎఐ వినియోగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News