Thursday, May 2, 2024

పండోరా గుప్త ఖాతాల సంచలనం

- Advertisement -
- Advertisement -

Cases pertaining to ‘Pandora Papers ’ to be investigated

భారతీయుల ఖాతాలపై సిబిడిటి సారథ్యంలో దర్యాప్తు : కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : పండోరా పత్రాలు 2021 వెల్లడి తదనంతర పరిణామాలపై భారతదేశం స్పందించింది. ఈ ఉదంతంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) సారథ్యంలో బహుళ స్థాయి సంస్థల బృందం దర్యాప్తు జరుగుతుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. పన్నుల తక్కువ స్థాయి దేశాలలో భారీస్థాయి ఆర్థికలావాదేవీలు, ఆస్తులున్న 300 మందికి పైగా సంపన్న భారతీయులు, వ్యాపారవేత్తలు ఉన్నారని పండోరా పేపర్స్ లీకేజ్‌లో తెలిపారు. అయితే తాము ఎటువంటి తప్పిదాలకు దిగలేదని కొందరు సంపన్న భారతీయులు వివరణలకు దిగారు. సంస్థల నుంచి కూడా ప్రకటనలు వెలువడ్డాయి. అయితే సంబంధిత పత్రాలలో వెలుగుచూసిన అంశాలు, పేర్లపై సమగ్ర దర్యాప్తు ఉంటుందని సిబిడిటి ప్రకటన వెలువరించింది. పలు ఇతర సంస్థల నుంచి కూడా విచారణ జరగాల్సి ఉంది.

దీనితో అన్ని సంస్థల ప్రమేయంతో ఓ బృందంగా విచారణ జరుగుతుందని, నిజాలు తేల్చిన తరువాత చర్యలు ఉంటాయని సిబిడిటి ఈ ప్రకటనలో తెలిపింది. పలు దేశాలకు చెందిన ప్రముఖులు పన్నులు ఎగగొట్టేందుకు తక్కువ పన్నులు ఉండేదేశాలకు తమ సంపదలను తరలించిన అంశాన్ని వారి ఆర్థిక లావాదేవీల రికార్డులను అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల సమాఖ్య (ఐసిఐజె) వెలుగులోకి తెచ్చింది. 117 దేశాలకు చెందిన 600 మంది పరిశోధనాత్మక జర్నలిస్టులు సాహసరీతిలో ఈ లోగుట్టును ఛేదించి, పాండోరా పత్రాలుగా లీక్ చేశారు. పలు దేశాలలో ఈ వ్యవహారం ప్రకంపనలకు దారితీసింది. దర్యాప్తు బృందంలో సిబిడిటితో పాటు ఇడి, ఆర్‌బిఐ, ఎఫ్‌ఐయు వంటి సంస్థలు పాలుపంచుకుంటాయి. ఆదాయపు పన్ను వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత స్థాయి నిర్ణయాత్మక పాత్ర ప్రత్యక్ష పన్నుల విభాగానిదే అయి ఉంటుంది.

పత్రాలలో 300 మంది భారతీయులు

వెలుగులోకి వచ్చిన పండోరా పత్రాలలో వందలాది మంది భారతీయుల పేర్లు ఉన్నాయని వెల్లడైంది. ఈ పత్రాల పేర్ల జాబితాలో అనిల్ అంబానీ, వినోద్ అదానీ, జాకీ ష్రాఫ్ (సినీనటుడు), కిరణ్ మజుందార్‌షా, నీరా రాడియా, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సతీష్ శర్మయ వంటి వారి పేర్లను ఇప్పటివరకూ వెలుగులోకి తెచ్చారు. తాము సేకరించిన జాబితాలో 300 మందికి పైగా సంపన్న, పేరు మోసిన వ్యాపార, వాణిజ్య ఇతర వర్గాల రంగాలకు చెందిన వారు ఉన్నారని పత్రాల లీకేజ్ పరిచయ దశలో జర్నలిస్టుల సమాఖ్య తెలిపింది. దశలవారిగా అందరి పేర్లను, కంపెనీల వివరాలను బయటపెడుతామని వెబ్‌సైట్ ద్వారా వివరించింది. క్రికెట్‌తో దేశానికి వన్నె తెచ్చిన సచిన్ పేరు ఈ జాబితాలో ఇప్పటికే వెలుగులోకి రావడంతో క్రీడా రంగంలో సంచలనానికి దారితీసింది.

అయితే ఇటువంటి అక్రమ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని పలువురు ప్రముఖ భారతీయులు తమ వివరణలతో వ్యాఖ్యలకు దిగారు. ఆర్థిక తప్పిదాలకు పాల్పడే ప్రసక్తే లేదని తెలిపారు. ఐదేళ్ల క్రితం నాటి పనామా పత్రాలతో పోలిస్తే ఇప్పటి పండోరా లీకేజ్ ప్రపంచవ్యాప్త సంచలనానికి దారితీసింది. బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ బైకాన్ కార్యనిర్వాహణాధికారి కిరణ్ మజుందార్ షా సోమవారం ప్రకటన వెలువరించారు. తన భర్త విదేశీ కంపెనీ పేరు ప్రస్తావించడం బాధాకరం అన్నారు. తమది విశ్వసనీయ, చట్టబద్ధమైన సంస్థ అని స్పష్టం చేశారు. మీడియా కథనాలలో అసత్యప్రచారం జరుగుతోందని తెలిపారు. స్వతంత్య్ర ట్రస్టీలతో తమ ట్రస్టు నడుస్తోందని తెలిపారు. భారతీయ నివాసి ఎవరు కూడా ట్రస్టులో కీలక పాత్రలో లేరని వివరించారు.

అంతా చట్టబద్ధమే : సచిన్ లాయర్లు

మాజీ క్రికెటర్ సచిన్ పెట్టుబడులు సంపద అంతా కూడా చట్టబద్ధమైనదే అని, పన్నుల అధికారులకు తెలియజేసిందదేనని ఆయన తరఫు లాయర్ల బృందం సోమవారం వివరణ ఇచ్చింది. ఎటువంటి అక్రమలావాదేవీలకు తావే లేదని తెలిపారు. ఇక పాప్ సింగర్ షకీరా అటార్నీ స్పందిస్తూ ఆమె తమ కంపెనీల వివరాలు చాలా రోజుల క్రితమే ప్రకటిచిందని చెప్పారు. ఐసిఐజె వెలువరించిన పత్రాలలో జోర్డాన్ రాజు , ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్‌ల దేశాధ్యక్షులు , చెక్ ప్రధాని , బ్రిటన్ మాజీ టోనీ బ్లెయిర్ వంటి వారి పేర్లు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News