Monday, September 22, 2025

ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచార జరిపి, తీర్పును రిజర్వు చేసింది. రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేస్తూ కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో, ఛార్జిషీట్ లో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు వెల్లడించారు. కేసు ప్రాథమిక దశలోనే నిందితునిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసిందని చెప్పారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఎఫ్‌ఐఆర్ కొట్టి వేయటం మొత్తం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

కాగా, జెరూసలెం మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులో సిఎం ఉన్నా నిందితునిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టి వేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయటం అభినందనీయమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది మేనకా గురుస్వామి స్పందిస్తూ అది రాష్ట్ర ప్రభుత్వనికి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు.

Also Read: మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News