Sunday, March 26, 2023

మూర్ఛ వ్యాధి పిల్లలతో జాగ్రత్త

- Advertisement -

మూర్ఛ అన్నది నరాల సంబంధ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం మీద దాదాపు 50 మిలియన్ మూర్ఛ రోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనే ఉన్నారు. భారత్‌లో 12 మిలియన్ మంది ఉన్నారు. పిల్లల్లో ఇది సర్వసాధారణమైన మెదడు రుగ్మత. మూర్ఛ లక్షణాలు బాగా తెలిసినా పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు విభిన్నంగా ఉండడంతో గుర్తించడం కష్టమవుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకుంటే జీవితాంతం జ్ఞాపక శక్తి మందగించడం, ఒకచోట నుంచి మరోచోటకు వెళ్ల లేక పోవడం వంటి రుగ్మతలు కొనసాగుతుంటాయి. పిల్లల్లో మూర్ఛ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తే తీవ్రమైన ఆందోళనకు గురి కావలసి వస్తుంది. ఎందుకంటే వారి మెదడు పెరిగే దశలో ఉంటుంది. ఈ దశలో అదే పనిగా పదేపదే మూర్చ వస్తుంటే జీవితాంతం వైకల్యంతో బాధపడవలసి వస్తుంది. పెరుగుతున్న పిల్లల్లో మూర్ఛ గుర్తించలేం. అనుకోకుండా శరీరం కంపించడం, తరచుగా స్పృహ కోల్పోవడం పిల్లల్లో కనిపిస్తుంటే సకాలంలో గుర్తించి వైద్యం అందించ వలసి ఉంటుంది. అయితే పిల్లలందరికీ ఈ లక్షణాలు ఉంటాయని అనుకోరాదు.

యువకులైన మూర్ఛ రోగుల్లో తేరిపార చూడడం, వేగంగా రెప్పలు కొట్టుకోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, మాటలకు స్పందన లేక పోవడం, అకస్మాత్తుగా తూగి పోవడం కనిపిస్తుంటాయి. మనం పిల్లలు భయపడుతున్నారేమో అని భావిస్తుంటాం తప్ప అసలు కారణం కనుక్కోలేం. మెదడు అంతా ఒక్కసారి ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. మెలికలు తిరిగి పోతుంటారు. మూత్రాన్ని ఆపుకోలేక పోతుంటారు. ఏ కారణం లేకుండానే తూలి పడిపోతుంటారు. తల ఒక పద్దతిలో ఊపుతుంటారు. గందరగోళంగా కనిపిస్తుంటారు. ఇవన్నీ పిల్లల్లో మూర్ఛ లక్షణాలని పెద్దలు కాదు కదా కొందరు డాక్టర్లు కూడా గుర్తించలేరు. పెద్దల్లో మూర్ఛ సంగతి ఎలా ఉన్నా పిల్లల్లో వస్తే మాత్రం తగిన వైద్యం వెంటనే అందించాలి. లేకుంటే పిల్లల్లో ఎదుగుదల ఉండదు. చికిత్స ప్రారంభించిన తరువాత పిల్లవాడు బాగానే ఉన్నాడు కదా అని చికిత్సను ఆపివేయరాదు. నిరంతరం చికిత్స కొనసాగుతుండాలి. ఒకవేళ మరే సమస్య లేదనుకుంటే డాక్టర్ పరీక్షించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలి. అలా చేయకుంటే మళ్లీమళ్లీ మూర్ఛ వస్తూనే ఉంటుంది.

ఆధునిక వైద్య ప్రక్రియల్లో చాలా వరకు మూర్ఛ లక్షణాలు తగ్గుతాయి,. అయితే 20 శాతం మంది రోగులు ఈ వైద్యానికి స్పందించడం లేదని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అలాంటి కేసుల్లో స్పందించక పోవడానికి మెదడులో ప్యాచ్‌లు ఏర్పడడం లేదా అసాధారణ కణజాలం ఏర్పడడమేనని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా నాడీ సంబంధ వైకల్యాలు ఏర్పడతాయి. మెదడు లోని ప్యాచ్‌లను శస్త్రచికిత్స ద్వారా నిర్మూలిస్తే మూర్ఛలు నయమవుతాయి. కానీ ఈ ప్యాచ్‌లో చాలావరకు ఉంటుంటాయి,. పిల్లలందరిలో ఒకేలా మూర్ఛ లక్షణాలు ఉండవు. అందుకని పిల్లల్లో మూర్ఛ లక్షణాలను తల్లిదండ్రులే జాగ్రత్తగా గమనిస్తుండాలి. మూర్ఛ లక్షణాలున్న పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టరాదు. తొట్టెల్లో స్నానానికి వెళ్లనీయరాదు. షవర్‌బాత్ మంచిది. బాత్ రూమ్ లో వాళ్లున్నప్పుడు గడియపెట్టరాదు. పక్కన పెద్దలు కనిపెట్టుకుని ఉంటేకానీ ఈత కొట్టించరాదు. బోటింగ్ చేసే టప్పుడు లైఫ్ జాకెట్ తొడిగితే చాలా మంచిది.నిచ్చెనైనా సరే 10 అడుగుల కన్నా ఎత్తు ఎక్కనీయరాదు. బైక్ రైడింగ్, హార్స్‌రైడింగ్ సమయాల్లో హెల్మెట్ ధరించాలి. తరచుగా మూర్ఛ వచ్చే పిల్లల విషయంలో బైక్ రైడింగ్ చేయనీయరాదు. ఓపెన్ స్టవ్‌పై వంట చేయించరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News