Monday, May 6, 2024

వ్యవస్థ సృష్టే బాల కార్మికులు!

- Advertisement -
- Advertisement -

భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతున్నది. ప్రపంచలో 5-17 సంవత్సరాల లోపు 16 కోట్ల 8 లక్షల పిల్లలు బాల కార్మికులుగా గుర్తించబడ్డారు. అత్యంత పేద దేశాలలో నలుగురిలో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు. బాల కార్మికుల్లో అత్యధిక సంఖ్యలో (29%) ఉప సహరా, ఆఫ్రికాలో నివసిస్తున్నారు. 2017 లెక్కల ప్రకారం ఆఫ్రికన్ దేశాలైన మాలి, బెనిన్, చాడ్ గనియా, బసావులలో 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో 50% పైగా బాల కార్మికులుగా పని చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రపంచ వ్యాపితంగా బాలకార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆర్థిక అవసరాల రీత్యా తమ పిల్లలను తల్లిదండ్రులే బాల కార్మికులుగా నియమిస్తున్నారు. ప్రపంచంలోని 10 దేశాలలో బాల కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో సుడాన్, ఉగాండా, కాంగో మొదటి స్థానాల్లో ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థలో భారతదేశం 6వ స్థానంలో ఉంది.

భారతదేశంలో బాల కార్మికులు: అధికార మార్పడి జరిగి 76 సంవత్సరాలైనా 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దేశంలో 5 నుంచి 14 సంవత్సరాల వయస్సులో ఉన్న బాల కార్మికులు కోటి 26 లక్షల మంది ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. బెల్జియం దేశ జనాభా కన్నా వీరు ఎక్కువ. యూనిసెఫ్ ప్రకారం దాదాపు సగం మంది, ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం 43% పిల్లలు 8వ తరగతిలోపే బడి మానేసి బాల కార్మికులుగా మారారు. ఇది షెడ్యూల్డ్ కులాల్లో 55%, షెడ్యూల్డ్ తెగల్లో 63%గా ఉంది. మరో సంస్థ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ ప్రీ ట్రేడ్ యూనియన్ ప్రకారం భారత దేశంలో ఆరు కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు.

అనధికార గణాంకాల ప్రకారం బాల కార్మికుల సంఖ్య 10 కోట్లు. భారత మొత్తం జనాభాలో వీరు 14% కాగా, కార్మికుల్లో 4%గా ఉన్నారు. 2017 గణాంకాల ప్రకారం వివిధ రకాల బాల కార్మికులు 33 మిలియన్లగా ఉన్న ఆసియాలోని ప్రముఖ దేశాల్లో భారత దేశం ఒకటి. భారతదేశంలోని పది మంది పిల్లల్లో ఒకరు జీవనోపాధి కోసం పని చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద బాల కార్మికుల యజమానుల ఉన్న రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ప్రపంచ మొత్తం మీద అత్యధిక బాల కార్మికులు భారత దేశంలోనే ఉన్నారు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఎక్కువగా బాల కార్మికులు ఉన్నారు.

బాల కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరికి వేతనం తక్కువ, పని గంటలు ఎక్కువ. వజ్రాల చెక్కుడు పరిశ్రమ, శివకాశిలోని మందు గుండు పరిశ్రమ, జైపూర్‌లోని రాళ్ల చెక్కుడు పని, ఫిరోజాబాద్ అద్దాల పరిశ్రమల్లో, మురా దాబాద్‌లోని లోహ పరిశ్రమ, ఆలీఘర్‌లోని తాళాల పరిశ్రమ, మీర్జాపూర్ తివాచీల తయారీలోనూ, మార్కాపూర్‌లోని పలకల తయారీ పరిశ్రమ మొదలైన పరిశ్రమల్లో ప్రధానంగా పని చేస్తున్నారు. ఈ పరిశ్రమల్లో పని చేసే బాల కార్మికులు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. తివాచీల తయారీ పరిశ్రమల్లో పని చేసే బాలలు కంటి చూపు కోల్పోతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. కశ్మీరులోని తివాచీల పరిశ్రమలో పని చేస్తున్న వారిలో 60% మంది క్షయ, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నా యి.

ఫిరోజాబాద్‌లోని గ్లాస్, గాజుల పరిశ్రమల్లో పిల్లలు ఆస్తమా, బ్రాంకైటీస్, కంటి సంబంధిత రోగాలకు గురవుతున్నారు. శివకాశి టపాకాయల పరిశ్రమల్లో పేలుళ్ళు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ముగ్గురులో ఇద్దరు శారీరక హింసకు గురవుతున్నారు. 50% మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపుల బారినపడుతున్నారు. వీరిలో 21%మంది అత్యంత తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారు.
ప్రపంచ మైకా ఉత్పత్తిలో భారత్ 60% వాటా కలిగి ఉంది. ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ ప్రకారం ప్రపంచంలోని మైకోలో నాలుగవ వంతు జార్ఖండ్, బీహార్ నుండి వస్తున్నది. ఈ అక్రమ గనుల్లో 22 వేల మంది పిల్లలు పని చేస్తున్నారు. దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న, పేద ప్రాంతాల్లో మైకా బెల్ట్ ఒకటి. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం బీహార్ జనాభాలో 33.74%, జార్ఖండ్ జనాభాలో 36.96% దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రాల్లో అధికంగా బాల కార్మికులు ఉన్నారు.

బాల కార్మిక చట్టాలు: భారత దేశంలో తీవ్రంగా ఉన్న బాల కార్మిక వ్యవస్థపై అనేక దేశాలు విమర్శలు చేయటంతో, బాలల రక్షణకోసం అంటూ పాలకులు కొన్ని చట్టాలు చేశారు. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం, 2005లో జాతీయ బాలల చట్టం, 2007 మార్చిలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు, 2009లో విద్యా హక్కు చట్టం, 25-9- 2008లో బాల కార్మిక చట్టం, 1986 బాల కార్మిక ( నిషేధ, నిర్మూలన) చట్టంలో 16-62014 న సవరణలు, తిరిగి 2016లో చట్ట సవరణ, బాల, కౌమార లేబర్ చట్టానికి 31- 3- 2017లో సవరణ చేసిన చట్టం, 1-9- 2016న బాల కార్మిక (పీ&ఆర్) సవరణ చట్టం మొదలగు చట్టాలు పాలకులు చేసిన చట్టాల్లో కొన్ని. ఈ చట్టాలేవీ బాలలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేయలేకపోయాయి. అలంకార ప్రాయ చట్టాలుగానే మిగిలాయి.

బాలకార్మిక సమస్యలను పరిష్కరించటంలో పాలక ప్రభుత్వాల వైఫల్యాలపై తీవ్ర విమర్శలు రావటంతో, వారి సమస్యలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సులు చేయటానికి 1979లో గురుపాదస్వామి కమటీని ఏర్పాటు చేసింది. పేదరికం ఉన్నంత వరకు బాల కార్మిక వ్యవస్థ ఉంటుందని, న్యాయ చర్యల ద్వారా నిర్మూలించలేమని గురుపాదస్వామి కమిటీ పేర్కొంది. బాలలు బాల కార్మికులుగా మారటానికి ఏ దేశంలోనైనా సామాజిక, ఆర్థిక విధానాలు, ఆర్ధిక వ్యత్యాసాలు ప్రధాన కారణం. భారత సామాజిక వ్యవస్థ ఆర్థిక వ్యత్యాసాలతో కూడుకున్నది.

దీనికి రాజ్యాంగ సంస్థలు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న దోపిడీ వర్గాల ప్రభుత్వాలు రక్షణగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వ పాలనలో ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్రమైనా యి. దేశ వనరులన్నీ అదానీ, అంబానీ లాంటి కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణించటం, ప్రభుత్వ భూములను కారు చవకగా పెట్టుబడిదారులకు కట్టపెడుతున్న ఫలితంగా దేశ సంపదలో 1% మంది వద్ద 25% ఉంటే, మరో 10 % మంది వద్ద 44% సంపద ఉంది. కొవిడ్ కాలంలో కూడా బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కు పెరిగారు. గౌతమ్ అదానీ సంపద 2020లో 890 కోట్ల డాలర్లు ఉంటే 2021 నాటి 8,220 కోట్ల డాలర్లకు, ఇదే కాలంలో ముఖేశ్ అంబానీ సంపద 3680 కోట్ల డాలర్ల నుంచి 8580 కోట్ల డాలర్లకు పెరిగాయి. మరో పక్క కొవిడ్ కాలంలో మరో 4 కోట్ల 60 లక్షల మంది పేదరికంలోకి నెట్టబడ్డారు.

నేడు దేశంలో పేదరికం 45% పైగా ఉంది. గ్రామీణ ప్రాతంలో భూమి కొద్ది మంది వద్దే ఇప్పటికీ అత్యధికంగా ఉండి పేదలకు భూమి దక్కక పోవటంతో గ్రామీణ పేదరికం 50% పైగా ఉంది. ఫలితంగా గ్రామీణ, పట్టణ పేదల కుటుంబ పోషణ భారంగా మారింది. వారికి వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు ఏ మాత్రం చాలక పిల్లలను కూడా పనుల్లోకి పంపాల్చిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా పేద కుటుంబాల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. గ్రామీణ పేదలకు విప్లవ భూ సంస్కరణల ద్వారా భూమి పంపిణీ చేయటం, వ్యవసాయ ఆధారిత, ప్రజల అవసరాలను తీర్చే పరిశ్రమలను స్థాపించి కార్మికులను భాగస్వామ్యం చేయటం, గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించటం, దేశ సహజ వనరులను ప్రజల అవసరాలకు ఉపయోగించటం ద్వారా బాల కార్మిక ఉత్పత్తిని అరికట్టగలము. ప్రజలే అందుకు పిడికిలి బిగించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News