Thursday, May 2, 2024

వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌తీ ఈ సమస్య మరింత జటిలమయ్యింది. ఈ క్రమంలో రాజకీయ వైషమ్యాలను వీడి, సమస్య పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేయాలని ఎల్జీతోపాటు ఆప్ నేతృత్వం లోని ఢిల్లీ ప్రభుత్వానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్‌పర్శన్ నియామకంపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానించింది. డీఈఆర్‌సి ఛైర్‌పర్సన్ నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ఇద్దరు రాజకీయ వైషమ్యాలకు అతీతంగా ప్రవర్తించాలని అభిప్రాయ పడింది.

ఈ క్రమంలో ఎల్జీ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు కలిసి డీఈఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక కోసం మాజీ న్యాయమూర్తుల పేర్లపై చర్చించాలని సూచించింది. తదుపరి విచారణ జులై 20న చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. దేశ రాజధానిలో ఐఎఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోన్న ఢిల్లీ ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదే సమయంలో ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఆప్ నిమగ్నమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News