Sunday, April 28, 2024

సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారు

- Advertisement -
- Advertisement -
CM KCR said Sarpanches were living with dignity
వారిని తలెత్తుకునేలా చేశాం
కాంగ్రెస్ హయాంలో సర్పంచ్‌లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారు
నిధులు దారి మళ్లీంపు అన్న విషయం సత్యదూరం
సభ్యులు ఇచ్చే ఏ విషయంపైనైనా తాము మాట్లాడడానికి సిద్ధం
అణాపైసాతో లెక్కచెబుతాం, నిధులు రాష్ట్రాల హక్కు
కేంద్రం దయాదాక్షిణ్యాలు అవసరం లేదు
ముందుగా పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో చర్చించాలి
ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సిఎం కెసిఆర్ అసంతృప్తి

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్‌లు గౌరవంగా బ్రతుకుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. సర్పంచ్‌లు గర్వంగా తలెత్తుకునేలా చేశామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు దాని గురించి గతంలో రెండు గంటల పాటు తానే వివరించానన్నారు. కాంగ్రెస్ హయాంలో సర్పంచ్‌లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని, ప్రస్తుతం సర్పంచ్‌లు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని సిఎం కెసిఆర్ గుర్తుచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అధికారులు, ప్రధాని, నీతిఆయోగ్ మనరాష్ట్రంపై ప్రశంసలు గుప్పించారని, అనేక అవార్డులు అందుకున్నామన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులలు అడిగిన ప్రశ్నలకు సిఎం సమాధానమిచ్చారు. |శాసనసభలో అడ్డగోలుగా మాట్లాడితే సరికాదని, విషయాలను అవగాహన చేసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కెసిఆర్ చురుకలంటించారు.

ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారంటూ ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ ‘ఎవరు గొంతు నొక్కుతున్నారు? మీరు బ్రహ్మాండంగా.. అద్భుతంగా మాట్లాడండి.. మేం మీకంటే అద్భుతంగా మాట్లాడతాం. మనకంటే అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు బాధపడిన మాట వాస్తవం కాదా, ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారని కెసిఆర్ పేర్కొన్నారు. గతంలో ఎన్నో పంచాయతీలు దివాలా తీశాయని, గత ప్రభుత్వాల బకాయిలు ఇప్పటికీ ఉన్నాయని, అవాస్తవాలు చెప్పేందుకు ఆస్కారం లేదన్నారు. కరోనా లాంటి సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులొస్తే మంత్రులు, శాసనసభ్యుల జీతాలు ఆపేసి పంచాయతీలకు నిధులు ఇవ్వాలని ఆర్థిక, పంచాయతీరాజ్ కార్యదర్శులను ఆదేశించామని కెసిఆర్ తెలిపారు. గతంలో ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో సైతం చెప్పానని దీనిపై ప్రతిపక్ష సభ్యులకు అవగాహన రాహిత్యం ఉంటే తానేమీ చేయలేనన్నారు. గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నామన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధుల గురించి వెల్లడిస్తా

కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్ల నిధులను తాము మళ్లీంచామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొనడంపై నవ్వాలో, ఏడవాలో తెలియదన్నారు. కొన్నిచోట్ల వనరులుంటే, కొన్నిచోట్ల ఉండవన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూముల అమ్మకాలు ఉండవన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుకు ముందు ఈ విషయాలన్నీ చర్చించామన్నారు. క్వశ్చన్ వేసే అధికారం ఉన్నంత మాత్రాన తిమ్మిని బమ్మి చేస్తామంటే కుదరదన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇండియా ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు గ్రాంట్లను ఇస్తుందన్నారు. ఇది రాష్ట్రాలకు రావాల్సిన హక్కు అని ఆయన తెలిపారు. కేంద్రం ఆటోమెటిక్‌గా ఈగ్రాంట్లను విడుదల చేయాలని, అవి కేంద్రం డబ్బులు కాదని సిఎం కెసిఆర్ తెలిపారు.

మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేశాం

నిధులు రాష్ట్రాల హక్కని, కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు పూర్తిగా చెల్లించామన్నారు. అఖిలపక్షం వస్తే రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదామన్నారు. కాంగ్రెస్ సభ్యుల నియోజకవర్గాల్లోని పల్లెల్లో పరిస్థితులను పరిశీలిద్దామన్నారు. దేశంలో ఎక్కడాలేని వికాసం తెలంగాణలోనే జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 24 వరకు మ్యాచింగ్ గ్రాంట్లు పూర్తిగా చెల్లించామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల లెక్కల వివరాలు ఇస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీలకు సమన్యాయంలో జరగాలన్న ఉద్ధేశ్యంలో భాగంగా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రిజిస్ట్రేషన్, సినరేజీల నుంచి వచ్చే వాటాలను పల్లెలకు అందేలా చూస్తున్నామన్నారు. పల్లెలు మురికికూపాలుగా మారిన నేపథ్యంలో తాము కొత్త చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.2 వేల కోట్లు గ్రామ పంచాయతీలకు బకాయిపడిందని సిఎం కెసిఆర్ తెలిపారు. మనం మాట్లాడేది ప్లాట్‌ఫాం కాదనీ, అసెంబ్లీలో అవగాహనతో మాట్లాడాలన్నారు.

కాంగ్రెస్ ఇచ్చినవి బోర్లకు సరిపోలేదు

అన్ని విషయాలపై 20 లేదా నెలరోజులు అసెంబ్లీని నడిపి చర్చించాలని సిఎం కెసిఆర్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సమగ్ర అభివృద్ధిలో భాగంగా వివిధ రకాల జీఓలను జారీ చేశామన్నారు. ముందుగా పల్లెప్రగతి, పట్టణప్రగతిపై ఈ అసెంబ్లీలో చర్చించాలన్నారు. కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో తెలంగాణ గురించి గొప్పగా చెప్పారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఈ విధంగా ఆలోచించలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన నిధులు బోర్లకు కూడా సరిపోలేదన్నారు. మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు ఎక్కడ చేయాలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలియలేదన్నారు. స్పీకర్ ఆధ్వర్యంలో కమిటీలను వేసి జిల్లాలో పర్యటిద్దామని సిఎం తెలిపారు. ఇక్కడ అసత్య ఆరోపణలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫరిడవిల్లాలన్నారు. మా తండాలో మా రాజ్యం కావాలని లంబాడీలు, కోయలు చాలా ఏళ్లు కొట్లారని, మా హయాంలోనే తండాలను గ్రామ పంచాయతీలు మార్చామని ఆయన తెలిపారు. అన్ని చోట్ల సమన్యాయం చేస్తున్నామన్నారు.

ఆ పంచాయతీలకు నిధులలిస్తామనలేదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సిఎం కెసిఆర్ చురకలంటించారు. సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సిఎం కెసిఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామని సిఎం కెసిఆర్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు, దీర్ఘకాలిక చర్చ పెట్టండని స్పీకర్‌కు సిఎం విజ్ఞప్తి చేశారు. తాము అన్నది తప్పకుండా చేసి చూపిస్తామని, ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని సిఎం తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు తగ్గిపోయాయి

సర్పంచ్‌లకు సర్వ స్వేచ్ఛ ఇచ్చామని, సర్పంచ్‌లకు అన్ని హక్కులు కల్పించామన్నారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించామని సిఎం కెసిఆర్ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగిందని, గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించేవి. ప్రస్తుతం అన్ని సీజనల్ వ్యాధులు, డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయన్నారు. గ్రామాల రూపురేఖలను మార్చేశామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని యూపిఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని, వ్యవస్థలో లోపాల వల్ల అప్పట్లో అవినీతి జరిగిందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు చేసిన తప్పిదం వలన వారిని తీసివేశామన్నారు. వాటిని సమీక్ష చేసిన తరువాతే ప్రత్యామ్నాయ వ్యవస్థను తాము తయారు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News