Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్ పాలనలో గురుకుల విద్యకు పెద్ద పీట

- Advertisement -
- Advertisement -
శాసన మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ పాలనలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్య అందుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాలు దేశానికి తలమానికంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 623 గిరిజన విద్యాసంస్థల్లో లక్ష 18 వేల మంది విద్యార్థులు విద్యనభ్యస్తున్నారని స్పష్టం చేశారు. వీరి ఆరోగ్య పర్యవేక్షణ కోసం 623 ఎఎన్‌ఎం పోస్టులను అవుట్సోర్సింగ్ కింద మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను కూడా 25 శాతం పెంచిందని వెల్లడించారు. విద్యాసంస్థల్లో గతంలో 1804 సిఆర్టిలు ఉండగా, అదనంగా మరో 299 మంది సిఆర్టిలను నియమించడంతో పాటు వారికి కేవలం 10 నెలలు మాత్రమే వచ్చే జీతాలను 12 నెలలకు పెంచి అందించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని రకాల గురుకుల విద్యాసంస్థలు కలిపి 291 ఉంటే వాటిల్లో కేవలం 1లక్ష 54 వేల మంది చెదివేవారు. స్వరాష్ట్రంలో 1022 గురుకులం ఏర్పాటు చేసుకుని 6 లక్షల10 వేల 810 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య, భోజనం అందిచడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అన్ని గురుకులాలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. కేవలం గిరిజన గురుకులాలు గతంలో 91 మాత్రమే ఉంటే అదనంగా మరో 97 గురుకులను ఏర్పాటు చేసుకుని 91,370 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. గురుకులాల్లో సీట్ల పొందడం కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు.

గురుకుల విద్యార్థులు ఐఐటిలు, ఎన్‌ఐటిలు, త్రిబుల్ ఐటిలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఎంబిబిఎస్, సెంట్రల్ యూనివర్సిటీలలో 6వేల మంది సీట్లు సాధించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాల్లో లాకోర్సు, ఫైన్ ఆర్ట్, సైనిక్ పాఠశాలను ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతనిస్తోందని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి విద్యార్థులు సాధించిన ర్యాంకులే నిదర్శనమన్నారు. విద్యా ప్రాముఖ్యతను ఇవ్వాలని ఉద్దేశంతో కొన్నిచోట్ల సొంత భవనాలు లేకపోయినా అద్దె భవనాలోనే విద్య కొనసాగిస్తున్నామని, సొంత భవనాల నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోవాలని వారికి అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా స్కాలర్షిప్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News