Monday, September 22, 2025

జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం: రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని, రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రం పూడ్చాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు. సింగరేణి 2024,-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటించింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ప్రకారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ఇప్పుడు ఈ నిర్ణయంతో నష్టం జరుగుతోందని సిఎం అన్నారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి ఏర్పడే నష్టంపై నివేదిక కూడా ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జీఎస్టీ చట్టం తెచ్చిన సమయంలో 14 శాతం ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వయబులిటీ గ్యాప్ ఫండ్ ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే విజిఎఫ్‌ను అమలు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, అంతే తప్ప తాము ఈ నిర్ణయాలు తీసుకుంటాం, మీ చావు మీరు చావండి అని మోడీ అనుకుంటే అది మంచిది కాదని సిఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్రానికి వస్తున్న నష్టంపై డిప్యూటీ సిఎం లేఖ రాస్తారని దానిని కిషన్ రెడ్డి కేంద్రం వద్దకు తీసుకువెళ్లి నష్టాన్ని భర్తీ చేయించాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News