Saturday, July 27, 2024

త్వరలో విద్యాకమిషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు, తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్‌లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలో సోమవారం వందేమాత రం పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం పదోతరగతిలో 10/10 సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సిఎం రేవంత్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను వి ద్యార్థు లు నెరవేర్చాలన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివి రాణిస్తే గొప్ప కాదని, ప్రభుత్వ స్కూల్స్ లో చదివి రాణిస్తే గొప్ప అని ఆయన అన్నారు. 90 శాతం ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని సిఎం రేవంత్ చెప్పారు.

సెమీ రెసిడెన్షియల్ విద్యావిధానంపై సమీక్ష చేస్తా
ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విద్యావిధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సిఎం చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా తల్లిదండ్రులకు, పిల్లల సంబంధాలు బలహీన పడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. 2024, జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమైన జయశంకర్ బడి బాట కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుందని రేవంత్ పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వాహణ మహిళా సంఘాలకే ఇచ్చామన్నారు. విద్యకు కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జీతాలకే అవుతోందన్నారు. విద్యపై చేసేది ఖర్చు కాదని అది, పెట్టబడని ఆయన తెలిపారు. విద్యపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సిఎం పేర్కొన్నారు. గత పాలనలో ప్రభుత్వ బడులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విద్యార్థులు లేరన్న నేపంతో బడులను మూసేశారని ఆయన తెలిపారు. ప్రైవేటు స్కూల్స్‌కు పంపిస్తే ప్రజలు అప్పుల పాలవుతారని ఆయన చెప్పారు. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ లో తీవ్ర నష్టం జరుగుతుందని సిఎం రేవంత్ అన్నారు.

ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది…
ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని, వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించి తమ బాధ్యతను గుర్తు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడటం తమ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు తన హృదయపూర్వక అభినందనలు ఆయన తెలిపారు. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కానీ, సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి గ్రామం, ప్రతి తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.

గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని సిఎం సూచించారు. విద్యపై పెట్టే పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్ లో రాణించాలని ఆకాంక్షిస్తున్నానని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళతామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News