Saturday, September 20, 2025

ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆడబిడ్డలందరికీ సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడిలో నేడు బతుకమ్మ సంబురాలు ప్రారంభం
సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అధికార యంత్రాం
ఈ వేడుకలకు హాజరు కానున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క
రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలకు షెడ్యూల్ విడుదల
చివరి రోజు ఈ నెల 30న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుక
గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, ఇకెబానా- జపనీయుల ప్రదర్శన,
సెక్రటేరియట్ వద్ద 3డి మ్యాప్ లేజర్ షో

తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆట పాటలతో అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.

ఓరుగల్లు గడ్డ మీద నేటి నుంచి బతుకమ్మ సంబురాలు
ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని కోరారు. బతుకమ్మ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని అన్నారు. కాగా ఆదివారం నుంచి ఆడబిడ్డల ఆత్మగౌరవ అడ్డ ఓరుగల్లు గడ్డ మీద బతుకమ్మ సంబురాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

ఈ ఆరంభ వేడుకల్లో మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు వరంగల్ పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని వారు తెలిపారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఐక్యత స్ఫూర్తిని చాటేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించిందని అన్నారు. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రులు తెలిపారు. మన తల్లులు, అక్కాచెల్లెళ్లు భక్తి శ్రద్దలతో అలంకరించే బతుకమ్మలు కేవలం పూల సమాహారమే కాదని, అవి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి సజీవ రూపమని పేర్కొన్నారు. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రులు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదీ బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్
ఈ నెల 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో సాయంత్రం – బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభోత్సవం, హైదరాబాద్ శివారులో ఉదయం మొక్కలు నాటడం, ఈ నెల 22న హైదరాబాద్‌లోని శిల్పరామం, మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి, ఈ నెల 23న నాగార్జునసాగర్ బుద్ధవనం, ఈ నెల 24న భూపాలపల్లి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్, 25న భద్రాచలం ఆలయంలో, జోగులాంబ అలంపూర్, గద్వాల, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, 26న నిజామాబాద్ అలీ సాగర్ రిజర్వాయర్, ఆదిలాబాద్, మెదక్, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌లో ఉదయం – సైకిల్ ర్యాలీ, 27న నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ వద్ద ఉదయం మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటి కారిడార్,

హైదరాబాద్‌లో – బతుకమ్మ కార్నివల్, 28న హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో- గిన్నీస్ వరల్ రికార్డ్ కార్యక్రమం కింద 10,000కి పైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ ఏర్పాటు, ఈ నెల 29న హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద – ఉత్తమ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్‌తో, రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేషన్స్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు నిర్వహిస్తారు. ఈ నెల 30న ట్యాంక్‌బండ్‌పై – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా – జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్ వద్ద 3డి మ్యాప్ లేజర్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Also Read: యువత రాజకీయాల్లోకి రావాలి:కెటిఆర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News