హైదరాబాద్: సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, హైడ్రా వెబ్ సైట్‌ను కూడా సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులు రక్షించేదన్నారు. సిటీలోని నాలాలను ఆక్రమించడం వల్లే చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపై నిలుస్తున్నాయని చెప్పారు. కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తోందని.. వర్షం వస్తే.. రోడ్లపై కూలిన చెట్లను హైడ్రా నిమిషాల్లోనే తొలగిస్తోందని సిఎం చెప్పారు.
లేక్‌వ్యూ ఫేస్‌తో చెరువుల పక్కన కొందరు ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు నిర్మించుకున్నారని.. వాటి నుంచి వ్యర్ధాలు, మురుగునీటిని చెరువుల్లోకి వదులుతున్నారని మండిపడ్డారు. చెరువులు, నాలాలు ఆక్రమించిన వారికే హైడ్రా అంటే భయమన్నారు. వరదనీరు ప్రవహించాల్సిన నాలాలపై ఇళ్లు, అపార్టుమెంట్‌లు వెలిశాయని.. ఎవరెన్నీ విమర్శలు చేసినా ఆక్రమణలను నియంత్రిస్తామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.