బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడానికి
బిజెపి ప్రయత్నాలు శిఖండి
పాత్ర పోషిస్తున్న బిఆర్‌ఎస్
బిజెపి తప్పిదాలను బిఆర్‌ఎస్
ఎందుకు ప్రశ్నించడం లేదు?
జంతర్‌మంతర్ ధర్నాలో బిఆర్‌ఎస్
ఎందుకు పాల్గొనలేదు?
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్
రాకుండా అడ్డుపడిన మోడీ,
అమిత్‌షా పిఎసి సమావేశంలో
భవిష్యత్ వ్యూహం ఖరారు
ఢిల్లీలో మీడియా సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి, బిఆర్‌ఎస్‌లను బిసి ద్రోహులుగా, బిసి వ్యతిరేకులుగా తెలంగాణ స మాజం భావిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బిజెపి బిసి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే బిఆర్‌ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని సిఎం ధ్వజమె త్తారు. ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని ప్రభుత్వం చేస్తున్న ఏ మంచి పనికి సహకరించమని బిజెపితో బిఆర్‌ఎస్ అంటకాగుతోందన్నారు. బిజెపి తప్పిదాలను బిఆర్‌ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని సిఎం రేవంత్ ప్ర శ్నిం చారు. జంతర్‌మంతర్ వద్ద చేసిన ధర్నాలో బిఆర్‌ఎస్ ఎందుకు పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకుండా మమ్మల్నీ అవమానిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగష్టు 5,6,7 తేదీల్లో మీరు ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇచ్చినా తాము ఢిల్లీలో అందుబాటులోనే ఉంటామని రాష్ట్రపతికి సమాచారం ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు.
కానీ, తాము అపాయింట్ మెంట్ అడిగిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా రాష్ట్రపతిని కలిశారని, వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ, తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో తమ మంత్రి వర్గం, మా పార్టీ అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత్ షాలు తమకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ రాకుండా చేశారనే నిర్ధారణకు వచ్చామన్నారు. రాష్ట్రపతిని తాము కలిసి విజ్ఞప్తి చేస్తే బిసిల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాల్సి వస్తుందని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు తమకు అపాయింట్ మెంట్ రాకుండా చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. దురదృష్ట వశాత్తు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తమకు దొరకలేదని ఇది శోచనీయం, బాధాకరమని ఆయన తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమని సిఎం రేవంత్ అన్నారు.
బలహీనవర్గాల హక్కులను కాలరాయడానికి బిజెపి యత్నం
బలహీనవర్గాల హక్కులను కాలరాయడానికి బిజెపి మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూ వస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బిసిలకు న్యాయం చేయాలనుకుంటే కమండల్ కమిషన్‌ను తీసుకొచ్చిందన్నారు. రథయాత్ర పేరుతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును బిజెపి అడ్డుకుందన్నారు. ఆ తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బిసి రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే, యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో బిజెపి ఆ రిజర్వేషన్లు కూడా అడ్డుకుందన్నారు. కానీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఆ రిజర్వేషన్లను అమలు చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు మేం మొదలు పెట్టిన ఓబిసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. బిసి రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బిజెపి వితండవాదం చేస్తోందన్నారు. తాము పంపించిన బిల్లుల్లో ఏదైనా మతానికో, కులానికో రిజర్వేషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లు ఎన్ బ్లాక్‌గా కేటాయించనున్నట్టు సిఎం రేవంత్ తెలిపారు. కులాలు, ఉపకులాల రిజర్వేషన్లు ఎక్కడా లేవని, ఇప్పటి వరకు జరగలేదని ఆయన తెలిపారు.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చట్టాన్ని చదివారా లేదా..?
దురదృష్టవశాత్తు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని, వారు చట్టాన్ని చదివారో లేదో లేక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తనకు తెలియదని ఆయన అన్నారు. ఇంతకు వీళ్లు చదువుకున్నారా? లేక రాజకీయ ప్రేరేపితంతో చట్టాన్ని చదవకుండా కళ్లుమూసుకుని మాట్లాడుతున్నారో తెలియడం లేదని సిఎం రేవంత్ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టే 42 శాతం బిసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నామని వారు వితండవాదం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాకు రాహుల్, ఖర్గే రాలేదని బిజెపి వాళ్లు ఆరోపించడం అర్థరహితం అన్నారు. కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామని సిఎం రేవంత్ తెలిపారు.
ముస్లింలకు ఓబిసి రిజర్వేషన్లు ఇచ్చానని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో….
అందుకే సూటిగా అడుగుతున్న 2017 లో రాజస్థాన్ నుంచి అబ్దుల్ సత్తార్ ఒక వెనుకబడిన ముస్లిం యూపిఎస్ లో ఓబిసి రిజర్వేషన్ సాధించారని సిఎం రేవంత్ తెలిపారు. 1971 నుంచి నూర్ బాషా, దూదేకుల, ఇతర వివిధ వృత్తులను చేసే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయని, ఆ రిజర్వేషన్లు ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ఉన్నాయని సిఎం రేవంత్ తెలిపారు. మోడీ జన్మించిన గుజరాత్‌లోనూ ఈ రిజర్వేషన్‌లు ఉన్నాయని, మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మీరే కేంద్రంలో ఉండి ఆ రాష్ట్రాల్లో ముస్లింలకు ఒబిసి రిజర్వేషన్లకు అనుమతిస్తున్నారని ఆయన తెలిపారు. ముస్లింలకు ఓబిసి రిజర్వేషన్లు ఇచ్చానని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి
సామాజిక, ఆర్ధిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించబడుతాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేవని, తాము అలాంటి రిజర్వేషన్లు చేయలేదని, అయినా వాళ్లు వితండవాదం చేస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. ముస్లింల సాకుతో బిజెపి ఓబిసి రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు. దీనికి బిఆర్‌ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందన్నారు. ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బిజెపితో అంటకాగుతున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి చేస్తున్న తప్పిదాలను బిఆరెస్ ఎందుకు ప్రశ్నిచడంలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎందుకు నిన్నటి ధర్నాలో బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదన్నారు. బిఆర్‌ఎస్ తాము చేసిన ధర్నాకు మద్దతు ఇవ్వకపోగా మేం చేసిన ధర్నాను అవహేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాటి చెట్టంత పెరిగితే సరిపోదని, ఆవగింజంత అవగాహన కూడా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. మా చేతులు కట్టేసేలా బిఆర్‌ఎస్ వ్యవహారిస్తోంది తప్ప, బిసిలకు మద్దతు ఇవ్వాలన్న సోయి బిజెపి, బిఆర్‌ఎస్‌లకు లేదని ఆయన ఆరోపించారు. బిసి ద్రోహులుగా, బిసి వ్యతిరేకులుగా ఈ రెండు పార్టీలను తెలంగాణ సమాజం భావిస్తోందని, తాత్కాలికంగా మీరు విజయం సాధించారని అనుకోవచ్చు, కానీ, ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్ ను ఆమోదించాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ల తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందని ఆయన తెలిపారు.
త్వరలోనే హైదరాబాద్ లో పీఏసీ సమావేశం నిర్వహించి చర్చిస్తాం
విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బిసి రిజర్వేషన్లపై బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే నాలుగు నెలలుగా ఆ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోగా దానిని రాష్ట్రపతికి పంపడం వల్ల సమస్య మరింత జఠిలం అయ్యిందన్నారు. వీటిని ఆమోదం వేస్తే తప్ప చట్టబద్ధంగా చెల్లుబాటు కాదన్నారు. బిసి రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదని దీంతో పార్టీ పరంగా ఇవ్వాలా మరేదైనా ఉపాయం ఉందో త్వరలోనే హైదరాబాద్ లో పీఏసీ సమావేశం నిర్వహించి చర్చిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులోనూ వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించామన్న రేవంత్ రెడ్డి కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు.
బిసి రిజర్వేషన్ల అమలుకు మూడు మార్గాలు
బిసి రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీఓ ఇవ్వాలన్నారు. జీఓ ఇస్తే ఎవరైనా న్యాయస్థానానికి వెళితే స్టే వస్తుందని, జీఓ ఇచ్చి ఎన్నికలకు వెళితే మొదటి మార్గం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గమని రేవంత్ చెప్పారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయన్నారు. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయని సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మూడో మార్గం పార్టీ పరంగా బిసిలకు 42శాతం సీట్లు ఇవ్వడంతో పాటు బిసిలకు 42శాతం సీట్లను కేటాయించేలా ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తామని ఆయన వెల్లడించారు.