Tuesday, April 23, 2024

అటవీ భూముల లెక్కలపై ఆరా!

- Advertisement -
- Advertisement -

forest land

 

గ్రామ సభల ద్వారా మరింత సమాచార సేకరణ, అటవీ సంపద సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు
కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయం

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల లెక్కలపై సంబంధిత అధికారులు మరో సారి ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. తమ వద్ద ఉన్న లెక్కలతో పాటు ప్రజల నుంచి సమగ్ర సమచారాన్ని సేకరించడం ద్వారా అక్రమాలకు గురవుతున్న అటవీ భూములను కాపాడేందుకు అవకాశం ముందని అటవీ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతిలో అటవీ భూముల సంరక్షణతో పాటు సంబంధిచ చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు కూలంకషంగా వివరించనున్నారు. ఇదే సమయంలో చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త తర హా ప్రచార సాధనాలతో పాటు సోషల్ మీడియాను కూడా సాధ్యమైనంత మేరకు వినియోగించుకోవాలని తలపెట్టారు.

అటవీల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుడంతో పాటు కృత్రిమ అడవుల ఏర్పాటుపై కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందు లో భాగంగానే తెలంగాణకు హరితహారం పేరుతో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా పెద్దసంఖ్యలో మొక్కలను నాటుతోంది. ఇందులో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెంది న అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంఘాలు, మహి ళా సంఘాలు, బస్తీ సంఘాలను, కాలనీల అసోసియేషన్ సభ్యులను మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది. అలాగే పెద్దఎత్తున విద్యార్ధులను, యువకులను, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది. దీంతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సామాజిక కార్యక్రమంగా ముందుకు సాగుతోంది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు నిచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదాన్ని పల్లె ప్రగతి ద్వారా మరింత విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ఆయా గ్రామాల అవసరం మేర కు పెద్ద మొక్కలను సరఫరా చేయటం, గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటిని మార్చటంతో పాటు, మొక్కలు నాటడం, నిర్వహణలో వివిధ రకాలుగా సాంకేతిక సహకారాన్ని కూడా అటవీ శాఖ అందిస్తోంది. అదే సమయంలో అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల రక్షణతో పాటు, అటవీ నేరాల అదుపుపై అటవీ శాఖ ప్రచారాన్ని మొదలు పెట్టింది. సాంప్రదాయ పద్దతులకు తోడు కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను కూడా అటవీ రక్షణకు ఉపయోగిస్తోంది.

ముఖ్యంగా అటవీ సమీప గ్రామాల్లో అటవీ సంపద ప్రాధాన్యతను వివరించటం, ఎలాంటి ఆక్రమణలు, అటవీ ఉల్లంఘనలు, నేరాలు జరగకుండా అటవీ రక్షణను సామాజిక బాధ్యతగా తీసుకునేలా గ్రామ పంచాయితీ విధుల్లో ఈ విషయాన్ని చేర్చేలా అటవీ శాఖ కృషి చేస్తోంది. ముఖ్యంగా ఆయా గ్రామాల సమీపంలో ఎంత అటవీ భూమి ఉంది? అక్కడ ఉన్నటు వంటి వృక్ష, జంతు సంపదలను నమోదు చేయటంతో పాటు, అడవిని కాపాడటం వల్ల సమాజానికి ఒనగూడే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ప్రయత్నం కూడా అటవీ శాఖ చేస్తోంది. పౌర పర్యవేక్షణ ద్వారా అటవీ రక్షణ బలోపేతం అవుతుందని, అలాగే అటవీ చట్టాలపై అవగాహన తేవటం ద్వారా నేరాలను తగ్గించాలని భావిస్తోంది. దీనికి తోడు అటవీ ప్రాంతాల్లో గత యేడాది చేపట్టిన వివిధ అభివృద్ది పనులు, రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన పనులను వివరించటంతో పాటు గ్రామ సభ ఆమోదాన్ని కూడా స్థానిక అటవీ అధికారులు తీసుకుంటున్నారు.

అలాగే అవగాహన, ప్రచారం కోసం వీడియోలు రూపొ ందించటం, వాయిస్ ఎనౌన్స్ మెంట్లను గ్రామ సభల్లో వినిపించటంతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేలా అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌లో డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న వి. రమేశ్ స్వయంగా రాసి, పాడిన అడవి తల్లి పాటలను ఇటీవల విడుదల చేశారు. అడవి ప్రాధాన్యత, అందరికీ అవగాహన కల్పించేలా రమేశ్ చేసిన ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు. వివిధ జిల్లాల్లో స్థానిక అడవుల ప్రాధాన్యత, రక్షణ బాధ్యతపై ప్రజలను చైతన్యవంతం చేసేలా వాయిస్ మెసేజ్ లను కూడా అటవీ శాఖ సిద్దం చేసి ప్రచారంలో పెట్టింది. తెలంగాణకు హరితహారం పేరుతో అటవీ శాఖ ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్ లను నిర్వహిస్తోంది. శాఖ ద్వారా నిర్వహించే అన్ని కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోంది.

Collecting information on forest land calculations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News