Sunday, April 28, 2024

క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… లాలాపేట్‌కు చెందిన రాగుల సురేష్ కుమార్ (45), వెస్ట్ మారేడుపల్లికి చెందిన దివ్యాంగులరాలైన భాగ్య (41)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి సౌషిక్ (17), భవన్ (15) ఇద్దరు కొడుకులు ఉన్నారు. సురేష్ కుమార్ గత ఎనిమిదేళ్ల క్రితం కీసరలో స్థిరపడి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. కీసరలో కొన్నాళ్లు మొబైల్ షాపు నిర్వహించి వ్యాపారం సరిగానడవకపోవడంతో తిమ్మాయిపల్లి గ్రామంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపాడు. ఇది కూడా సరిగా నడవకపోవడంతో గతకొన్ని రోజులుగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారంతో పాటు ఇంటిపై క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.8 లక్షల వరకు అయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలోనే నెల బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది పలుసార్లు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు.

దీంతో చుట్టు పక్కల వారి ముందు బ్యాంకు సిబ్బంది అవమానించడంతో భార్యాభర్తలు మనస్తాపానికి లోనయ్యారు. కాగా శుక్రవారం రాత్రి ఓ శుభకార్యం ఉండటంతో సురేష్‌కుమార్ తన అత్తతో పాటు వారి ఇద్దరు కుమారులను పంపించాడు. ఆ తరువాత సురేష్ కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, భాగ్య భార్య పురుగుల మందు తాగింది. శనివారం ఉదయం సురేష్‌కుమార్ అత్త, కొడుకులు వచ్చి చూడగా ఇంట్లో ఇద్దరు విగతజీవుగా పడి ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో సుసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. క్రెడిట్ కార్డు అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. తమకు బయట వ్యక్తుల నుంచి రూ.3 లక్షలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు తమ కొడుకులకు అందేలా చూడాలని ఈ నోట్‌లో కోరారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News