Sunday, April 28, 2024

చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్

- Advertisement -
- Advertisement -

ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి
వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి
సిఎంకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్. రాజశేఖర్‌ రెడ్డిని గుర్తు చేసుకుంటూ తనను ‘చేవెళ్ల చెల్లెమ్మ’ అన్నందుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం 600 మీటర్ల ఎత్తులో ఉందని, అక్కడ బోర్లు వేసినా నీళ్లు పడవని అన్నారు.

రాజశేఖర్‌రెడ్డితో ఈస్ట్ గోదావరి వెళుతున్నప్పుడు ‘అక్కడ పచ్చని పొలాలు,… మా దగ్గర ఎండిపోయిన భూములు’ అని మాట్లాడుతున్నప్పుడు మా ప్రాంతం ఎత్తైన ప్రాంతమని, అయినా తమ ప్రాంతానికి నీళ్లు రావాలని.. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. ఆ ప్రాంతానికి సాగునీరు వస్తే ఆ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని, 111 జివో గుదిబండగా ఉందని, ఈ జివో కారణంగా బోర్లు వేసుకోనివ్వరు..చెక్ డ్యాంలు కట్టుకోనివ్వలేదని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వస్తే వికారాబాద్, పరిగి, చేవెళ్ల ప్రాంతాలు బాగుపడతాయని సంతోషపడ్డామని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో శనివారం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో టేలెండ్ ఉంది, ఇవ్వలేమని అప్పుడున్న ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేస్తున్న సందర్భంలో కచ్చితంగా నీళ్లు ఇవ్వాలని అడిగామని గుర్తు చేశారు.

ఆ ప్రాజెక్టు రద్దయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. తాను 2018 అసెంబ్లీలోకి వచ్చినప్పుడు కాళేశ్వరం కట్టినట్ల పాలమూరు రంగారెడ్డిని త్వరగా కట్టాలని అప్పటి సిఎం కెసిఆర్‌ను కోరానని గుర్తు చేశారు. తమ ప్రాంతమంతా ఎడారిలాగా ఉంటుందని, కాళేశ్వరంగా ఎంత స్పీడ్‌గా చేశారో..పాలమూరు రంగారెడ్డిని కూడా అంతే స్పీడ్‌గా చేయాలని కోరానని చెప్పారు. తాను ఎక్కడున్నా, ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా చేవెళ్ల నియోజకవర్గాన్ని తమ కుటుంబం మరిచిపోదని పేర్కొన్నారు. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పానని అన్నారు. రిజర్వాయర్లు పూర్తయి ఉన్నాయి కాబట్టి వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలని సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News