Monday, May 13, 2024

విరాట్ సేనకు ఎదురుందా? నేడు చెన్నైతో పోరు

- Advertisement -
- Advertisement -

 ముంబై : వరుస విజయాలతో ఈ ఐపిఎల్ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సేన పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తన ఖాతాలో ఐదో గెలుపును జమ చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు మాజీ చాంపియన్ చెన్నై కూడా జోరుమీదుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. హ్యాట్రిక్ గెలుపులతో జోరుమీదున్న చెన్నై కూడా మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇందులో గెలిచి బెంగళూరుఆధిక్యాన్ని సమం చేయాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

ఓపెనర్లే కీలకం..

రాజస్థాన్‌పై అజేయ శతకంతో కదం తొక్కిన యువ ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్‌పై బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది. అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన దేవ్‌దుత్ కళ్లు చెదిరే సెంచరీతో చాలెంజర్స్‌కు ఘన విజయం సాధించి పెట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జోరుమీదున్నాడు. కిందటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ నమ్మకంతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి, పడిక్కల్ విజృంభిస్తే బెంగళూరుకు ఈసారి కూడా శుభారంభం ఖాయం.

ఇక గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్‌లు కూడా భీకర ఫామ్‌లో ఉన్నారు. బెంగళూరు విజయాల్లో వీరిద్దరూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ కీలక ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. డివిలియర్స్ కూడా తనదైన బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. జెమీసన్ రూపంలో మరో విధ్వంసక బ్యాట్స్‌మన్ కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడు. బౌలింగ్‌లో కూడా బెంగళూరు చాలా బలంగా ఉంది. సిరాజ్, హర్షల్, చాహల్ తదితరులు నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 జోరుమీదుంది..

ఇక చెన్నై కూడా హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు కిందటి మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. ఇక డుప్లెసిస్ నిలకడైన ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొయిన్ అలీ కూడా దూకుడు మీద కనిపిస్తున్నాడు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. రాయుడు, సురేశ్ రైనాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక బ్రావో, శామ్ కరన్, జడేజా వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. దీపక్ చాహర్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నైకి కూడా గెలుపు అవకాశాలు సమంగా ఉన్నాయనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News