Tuesday, April 30, 2024

ఆర్థిక అభివృద్ధికి దోహపడుతున్న దళితబందు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి దళితబందు పథకం దోహదపడుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దకల్వల గ్రామంలో ఆటో మోబైల్ స్పేర్స్ పార్ట్, ఆయిల్ షాపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లబ్దిదారుడు దళితబందు వల్ల తన జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని వివరించారు.

గతంలో షాప్‌లో వర్కర్‌గా పని చేసేవాడినని, ఇప్పుడు దళితబందు సహాయంతో సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నానని, తద్వారా రూ.30 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు లబ్దిదారుడు వివరించాడు. అనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ దళిత వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కులుకల్పించి అంబేద్కర్ మేలు చేశారని అలాగే దళితజాతిని ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా సీఎం కేసీఆర్ దళితబందు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.

దేశంలో దళితులు అత్యంత పేదలుగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం అందించే పది లక్షల ఆర్థిక సహాయంతో గతంలో క్లీనర్లు, వర్కర్లుగా ఉన్న దళితులు నేడు ఓనర్లుగా మారుతున్నారని, దళితబందు లబ్దిదారుల యూనిట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు ఆయన సుల్తానాబాద్ మండలంలోని పర్యటించిన ఆయన అక్కడి ముగ్గురు లబ్దిదారులను కలిశారు.

సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో దళితబందు పథకం క్రింద పంపిణీ చేసిన రెండు ట్రాక్టర్లు, ఒక అశోక్ లేలాండ్ వాహానాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. మండలంలోని దుబ్బపల్లి గ్రామానికి చెందిన కల్వల సంపత్, గట్టెపల్లికి చెందిన దాసరి సంపత్, భూపతిపూర్‌కు చెందిన కవ్వంపల్లి శ్రీనివాసులు దళితబందు పథకం క్రింద తమకు కేటాయించిన యూనిట్ల ద్వారా గతం కంటే ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధూసూదన్ శర్మ, ఎగ్జిక్యూటివ్ అధికారి రవికుమార్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News