Wednesday, April 24, 2024

డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ పదవులన్నీ ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

DCCB

 

టిఆర్‌ఎస్ మద్దతుదారుల కైవసం
కొన్ని రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థుల కొరత

ప్రకటించిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ
కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ మద్దతుదారులు
కొన్నిచోట్ల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక నామినేషన్లు నిల్
ఫలించిన అధికార పార్టీ వ్యూహాలు…
29న చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లు, 9 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్)ల డైరెక్టర్ల పదవులన్నీ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణ పూర్తయిన తరువాత రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ మంగళవారం ప్రకటించింది. ఇందులో దాదాపు అన్నీ డైరెక్టర్ పదవులు టిఆర్‌ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. ఇక 29వ తేదీన ఆడిసిసిబి, డిసిఎంఎస్‌ల ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల పరిశీలన అనంతరం రహస్య పద్దతిలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటారు. డిసిసిబిలకు 20 మంది చొప్పున గ్రూప్ ఎలో 16, గ్రూప్ బిలో నలుగురు, డిసిఎంఎస్‌లో 10 మంది చొప్పున గ్రూప్ ఎలో ఆరుగురు, గ్రూప్ బిలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు.

ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదాముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు రాలేదు. 9 డిసిబిల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడు డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డిసిఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడు సభ్యులు లేక నామినేషన్లు పడలేదు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డిసిసిబి, డిసిఎంఎస్‌లు ఏకగీవ్రమైనట్లు ప్రకటించారు. రిజర్వుడు స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డిసిసిబిల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు.

ఇక అన్ని డిసిఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడు కేటగిరీలో ఎన్నిక జరగని 33 డిసిసిబి డైరెక్టర్, 16 డిసిఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత ఛైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు.

5న టెస్కాబ్ ఛైర్మన్ ఎన్నిక…
ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఛైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీచేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్‌లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు.

ఛైర్మన్‌లు కూడా ఏకగ్రీవమే!
డిసిసిబి, డిసిఎంఎస్‌లలో అన్ని డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవం కావడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులు కూడా లాంఛనంగా ఏకగ్రీవం కానున్నాయి. వీటన్నింటిని టిఆర్‌ఎస్ పార్టీ మద్ధతుదారులే గెలుచుకోనున్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ అధిష్టానం మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎల దగ్గర నుంచి తీసుకున్న సమాచారం మేరకు పోటీలో ఉండే అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పటి వరకు అవకాశం దక్కని వారికి, అలాగే పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నటువంటి వారి పేర్లు, రాజకీయ వారసత్వం కోరుకుంటున్న మంత్రులు, ఎంఎల్‌ఎల కుమారులు, బంధువుల పేర్లు ఫైనల్ చేసినట్లు తెలిసింది.

DCCB and DCMS Director positions are unanimous
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News