Friday, January 27, 2023

నువ్వేం స్నేహితురాలివి.. చావు రేవులో వదిలిపెట్టావు..

- Advertisement -

నువ్వేం స్నేహితురాలివి..చావు రేవులో వదిలిపెట్టావు
తాగి డ్రైవ్ చేసిందని అంటావా
దారుణ బాధితురాలిపై నిందలు అభాండాలా
మండిపడ్డ మహిళా కమిషన్ మాలీవాల్
దోషులను ఉరితీస్తేనే అంజలికి న్యాయం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాదాంతం చెందిన యువతి అంజలి సింగ్ ప్రవర్తనను కించపర్చే వ్యాఖ్యలకు దిగరాదని ప్రజలకు, ప్రత్యేకించి ఆమె స్నేహితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతీ మాలీవాల్ విజ్ఞప్తి చేశారు. స్నేహితురాలిననే ధర్మం కూడా మరిచిన తోటి యువతి, కొత్త సంవత్సరం రోజున ఓ కారు ఢీకొన్న ఘటనలో అంజలి వెంట ఉన్న స్నేహితురాలు వ్యాఖ్యలపై మాలీవాల్ తీవ్రంగా స్పందించారు. ఘటన దశలో అంజలి తాగి ఉందని ఈ స్నేహితురాలు ఢిల్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇటువంటి అనుచిత మాటలకు ఆమెనే కాదు ఎవరూ కూడా దిగరాదని మహిళా కమిషన్ నాయకురాలు తెలిపారు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే మాటలకు దిగడం అనుచితం అన్నారు.

ఘటన జరిగిన తరువాత వెంటనే ఈ స్నేహితురాలు ఎందుకు ముందుకు రాలేదని, సిసీటీవీ ఫుటేజ్‌ల క్రమంలో ఆమెను పోలీసులు గుర్తించి విచారణకు పిలిపించిన దశలో ఎందుకు స్పందించిందని ప్రశ్నించారు. అంజలి స్నేహితురాలు అయి ఉండి, చివరకు అంజలిపై ఆమె ఈ విధంగా నిందకు దిగడం దారుణం. నిజంగా స్నేహితురాలు అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది? కనీసం పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి తెలియచేయాల్సిన బాధ్యత ఆమెకు లేదా అని ప్రశ్నించారు. లేదా స్కూటీని డీకొన్న కారును ఆమె ఎందుకు అనుసరించలేదు.

చక్రాల కింద అంజలి పడి ఉన్నప్పుడు ఆమెను వదిలేసి వెళ్లడం న్యాయమా? అని నిలదీశారు. ఆమె కనీస పక్షం స్పందించినా అంజలి ప్రాణాలు దక్కేవి, ఇదేం స్నేహితురాలు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నేహితురాలు చెపుతున్న మాటలలో నిజానిజాలను తేల్చాల్సి ఉందని, ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలని మాలీవాల్ తెలిపారు. అంజలి ఓ వైపు అత్యంత భయానక చావుకు గురైంది. ఈ దశలో ఇప్పుడు ఆమెను కించపరిచే మాటలకు దిగడం భావ్యమా? అని ప్రశ్నించారు. ఆరోజు అంజలి విషాదకర మరింత అనుమానాస్పద స్థితిలో మరణించింది.

ఢిల్లీ రోడ్లపై ఆమె చావుబతుకుల మధ్య 12 కిలోమీటర్ల దూరం కారు కింద నలిగి పోయింది. తరువాత అంజలి నగ్నంగా కన్పించింది. దీనికి భిన్నంగా ఇప్పుడు వేరే మాటలు చెపుతున్న స్నేహితురాలిని విచారించాల్సి ఉందని మాలీవాల్ డిమాండ్ చేశారు. జరిగినదానికి ఎవరు కూడా అంజలిని నిందించాల్సిన పనిలేదని, నిందితులను విచారించి ఉరితీయాల్సి ఉందని స్పష్టం చేశారు. తాను భయపడి ఆరోజు పొద్దున జరిగిన ఘటనపై పోలీసులకు తెలియచేయలేదని, ఘటనా స్థలం నుంచి వెంటనే ఇంటికి వెళ్లాననే స్నేహితురాలి వాదనను మాలీవాల్ తీవ్రంగా తప్పుపట్టారు.

అంజలి తాగి లేదు: కుటుంబ డాక్టరు వెల్లడి
అంజలి ఆల్కహాల్ తీసుకోలేదని పోస్టుమార్టం నివేదికలో స్పష్టంగా నిర్థారణ అయిందని కుటుంబ డాక్టరు తెలిపారు. ఘటనకు ముందు రాత్రి ఆమె బాగా తాగి ఉందని, తరువాత స్కూటీపై వెళ్లిందనే స్నేహితురాలి వాదనను డాక్టరు ఖండించారు. ఆమె ఉదరంలో ఆల్కహాల్ లక్షణాలు ఏమీ లేవని వైద్యపరీక్షలలో తెలిందని తెలిపారు. శవపరీక్ష నివేదిక మేరకు చూస్తే ఆమె కడుపులో ఆహారం ఉన్నట్లు నిర్థారణ అయింది. ఒక వేళ ఆమె తాగి ఉంటే దీనికి సంబంధించిన నమూనాలు తీసుకున్న ఆహారంలో కలిసి అయినా వెలుగులోకి వచ్చేవని ఫ్యామిలీ డాక్టరు భూపేష్ తెలిపారు. ఇది అత్యంత దారుణమైన హత్య అని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం చూస్తే ఆమె పలు రకాలుగా చిత్రహింసలకు గురి అయింది. వంటిపై 40 గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles