తుది శ్వాస విడిచిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి
ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల సిఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నర్సారెడ్డి నేపథ్యం..
నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం. 1931, సెప్టెంబర్ 22న జన్మించాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ ఎల్‌ఎల్‌బి పట్టాలు పొందాడు. చిన్న తనంలో భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పని చేశాడు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసే పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నారు. 1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా సేవలందించారు.
1978లో అప్పటి సిఎం జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. వరుసగా 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1991లో ఆదిలాబాద్ ఎంపిగా, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్‌లోని వైట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు.
నర్సారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన సిఎం
నర్సారెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సిఎం రేవంత్‌రెడ్డి సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు. నర్సారెడ్డి మృతి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, కొండా సురేఖలు పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని వారన్నారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ వాదిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందారని వారు గుర్తు చేశారు.