Sunday, May 5, 2024

కార్పోరేట్‌ తరహాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్యసేవలు

- Advertisement -
- Advertisement -

Dental Services

 

హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్ష్యం, వివక్షకు గురైన వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దంత వైద్య కళాశాలను ఆధునీకరించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో దంత వైద్య కళాశాలలో కార్పోరేట్ తరహాలో రోగులకు ఉచితంగా దంత వైద్యసేవలను అందిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ కోల్సావాడీలోని ప్రభుత్వ దంత వైద్యశాలలో కార్పోరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతంగా పెరిగిందంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే వైద్యసేవలపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.

తొమ్మిది విభాగాల్లో….
ఉస్మానియా ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో తొమ్మిది విభాగాల వైద్య నిపుణులు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఓరల్ సర్జ రీ, పబ్లిక్ హెల్త్ ఓరల్ పెథాలజీ, ఆర్థో డాంటిక్స్, ప్రాస్థో డాంటిక్స్, ఫిరియో డాంటిక్స్, ఫెడొ డాంటిక్స్, ఎండో డాంటిక్స్ కన్జర్వేటివ్ డాంటిక్స్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ తదితర విభాగాధిపతులు ఆయా విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించడంతో పాటు వైద్య విద్యార్థులకు మెలుకువలు, అధునాతన శస్త్రచికిత్సా విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.

పెరిగిన రద్దీ ….
అఫ్జల్‌గంజ్ కోల్సావాడీలోని ప్రభుత్వ దంత వైద్యశాలలో గతంలో ప్రతిరోజూ 450 నుండి 500 మంది రోగులు అవుట్ పేషంట్లుగా వైద్యసేవలు పొందేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దంత వైద్య కళాశాలలో కల్పించిన సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 నుంచి క్రమేపీ పెరుగుతూ 1500లకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గల ఏకైక ప్రభుత్వ దంత వైద్య కళాశాల కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రి అభివృద్ది కోసం కోట్లాది నిధులు వెచ్చించి, వైద్యకళాశాలను ఆధునీకరరించడంతో పాటు ఆసుపత్రిలో అవసరమైన అన్నిరకాల అత్యాధునిక దంత వైద్య పరికరాలను, సామగ్రిని సమకూర్చింది. దంత వైద్య కళాశాలలో కల్పించిన అత్యాధుని క సదుపాయాలు, సౌకర్యాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మూడింతలకు పెరిగింది.

బిడిఎస్ సీట్ల పెంపు…సదుపాయాల కల్పన
దంత వైద్య కళాశాలలో గతంలో 40 బిడిఎస్ సీట్లు మాత్రమే ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 100 సీట్లకు, 18 ఎండీఎస్ సీట్లను 27కు పెంచింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు మేరకు ఆసుపత్రిని అభివృద్ది చేయడంతో పాటు వైద్య కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాదు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 20 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు పెరిగిన బిడిఎస్ సీట్లకు అనుగుణంగా వైద్యులతో పాటు రోగులకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు, వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో అదనపు భవనం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కొత్త భవనం అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, వైద్యరంగంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్యసేవలపై వైద్య విద్యార్థులకు శిక్షణ తరగతులలు నిర్వహించేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శాంతకుమారి పేర్కొన్నారు.

కార్పోరేట్‌కు ధీటుగా….ప్రిన్సిపల్ డాక్టర్ శాంతకుమారి
దంత సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఉస్మానియా ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిప ల్ డాక్టర్ పి శాంతకుమారి పేర్కొన్నారు. కార్పోరేట్ తరహాలో దంత వైద్య కళాశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యం లభిస్తుండటంతో ఔట్ పేషంట్ల సంఖ్య 500 నుంచి 1500లకు చేరిందన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తి కావచ్చిందని, ఈ భవనం అందుబాటులోకి వస్తే మరింత మెరుగైన వైద్యం అందించడానికి అనువుగా ఉంటుందన్నారు. దంత వైద్యకళాశాలను సందర్శించిన వైద్య విద్య సంచాలకులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లతో సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వ దంత వైద్య కళాశాల కార్పోరేట్ ఆసుపత్రిని తలపిస్తుందని కితాబిచ్చారని తెలిపారు.

Dental Services at Government Medical College
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News