Sunday, May 4, 2025

ఉగ్ర దాడి గురించి ముందుగానే తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఇంటలిజెన్స్ హెచ్చరించినా కిమ్మనని భద్రతా బలగాలు?
టూరిజానికి స్పాట్ పెట్టేందుకే పొరుగుదేశం పన్నాగం
ముందు తెలిసినా తిప్పికొట్టలేని మన నిస్సహాయత

న్యూఢిల్లీ : పహల్గాంలో ఉగ్రదాడులను ముందుగానే పసికట్టి, భద్రతా సంస్థలు జాగ్రత్తగా ఉండాలని ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. టెర్రరిస్టులు ఈ సారి తమ పంథా మార్చుకున్నారని, అత్యంత ప్రధానమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని , ఇందులో భాగంగానే అత్యధిక సంఖ్యలో జనం తరలివచ్చే పహల్గాం ప్రాంతాన్ని ఎంచుకుని దాడులకు దిగే అవకాశం ఉందని ఇంటెల్ హెచ్చరించినట్లు ఇప్పుడు దాడుల తరువాత వెల్లడైంది. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి చాలా కాలం ముందే శ్రీనగర్ శివార్లలోని హోటల్స్‌లో అతిధులుగా విడిది చేశారు. ప్రత్యేకించి జబరర్వాన్ శ్రేణి పర్వత పంక్తుల మధ్య ఉండే హోటల్స్‌లో తిష్ట వేసుకుని వీరి రెక్కి కార్యక్రమాలు జరిగాయని కూడా ఇంటలిజెన్స్ వర్గాలు పసికట్టాయి. వీరు సకాలంలోనే ఈ విషయాన్ని భద్రతా సంస్థలకు తెలిపాయి.

అయితే ఇప్పుడు ఈ దాడుల గురించి భద్రతా బలగాలకు, స్థానిక అధికార యంత్రాంగానికి ముందుగానే తెలిసినా ఎందుకు వీటిని నివారించలేదనేది కీలక ప్రశ్నగా మారింది. నిజానికి ఉగ్రవాదులు గత నెల మొదట్లో ప్రధాని మోడీ కత్రా నుంచి జమ్మూకు తొలి రైలు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ దశలోనే తమ విద్రోహ చర్యలకు పాల్పడాలని లష్కరేతోయిబా అనుబంధ , ప్రోత్సాహక సంస్థలు నిర్ణయించుకున్నాయి. అయితే భారీ భద్రత, ఎవరికి తెలియకుండా రహస్య మార్గం ద్వారా ప్రధాని సభా స్థలికి చేరడం వంటి పరిణామాలతో ఉగ్రవాదులు మరో అవకాశం కోసం ఎదురుచూశారు. అదును చూసుకుని పహల్గాం వద్ద పంజా విసిరారు. దీనికి బలి అయింది. కేవలం సుందర దృశ్యాలను చూసి ఆనందంగా తిలకించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలనుకున్న పౌరులే అని ఇప్పుడు వెల్లడైంది.

జమ్మూకు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే లింక్ ఏర్పడితే ఇక ఈ ప్రాంతం పర్యాటకంగా వృద్ధి చెందడం జరిగితే తమ మూలాలు దెబ్బతింటాయని ఉగ్రవాదులు భావించారు. రైలు మార్గ ప్రారంభానికి ప్రధాని రావల్సిన తేదీని ఓసారి వాతావరణ ప్రతికూలతతో వాయిదా వేశారు, తరువాత నిర్విఘ్నంగా సాగింది. రైలు మార్గం ప్రారంభోత్సవం విజయవంతం , అంతర్జాతీయ స్థాయిలో కశ్మీర్ భారత్ అంతర్భాగంగా పలు దేశాల రమణీయక స్థలాలను తలదన్నేదిగా ఉండటం , సంబంధిత ఫోటోలు విశ్వవ్యాప్త ప్రచారం పొందడంతో ఈ టూరిస్టు ప్రాంతాలను ఎంచుకునే ఉగ్రవాదులు పంజా విసిరారు. కశ్మీర్ పర్యాటకం ప్రాణాంతకం అని చాటిచెప్పారు.మరి దాడి నివారణకు భద్రతా సంస్థలు ఎందుకు యత్నించలేదు, ఉగ్ర దాడులు జరుగుతాయని, పర్యాటకులు రావద్దని ఎందుకు హెచ్చరికలు వెలువరించలేదు? ముందుగా తెలియచేస్తే పర్యాటకులు రాకుండా ఉంటారని భావించారా? లేక ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలను తేలిగ్గా తీసుకున్నారా? అనేది స్పష్టం కావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News