Friday, September 22, 2023

ఊపిరి పై పగ బట్టే పొగాకు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా..తెలంగాణ అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం.మొన్న మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నాo. ఉద్యమ స్పూర్తి తో తెలంగాణ సాధించుకున్నాం.అదే ఉద్యమ స్పూర్తితో ఊపిరి పై పగ బట్టే పొగాకు ను మన జీవితాల్లో నుంచి తరిమేద్దాం.ప్రతి వ్యక్తి కూడా పొగాకు, ధూమపానం అలవాట్ల కు దూరం గా ఉంటే?! నిత్య ఉత్సవమే.పొగాకు, ధూమపానం మానేస్తే?! దేహం లోని హృదయం కు,కాలేయం కు ఓ ఉత్సాహం . ఆరోగ్యానికి ప్రోత్సాహం. దేహానికే ఉత్సవం. దేహానికి జీవ ధార ఐన రక్తానికి అమృతోత్సవం. పొగాకు,దూమపానం అలవాట్లు ఉంటే?!అమృతం కూడా విషమే.వాటికి దూరంగా ఉంటే జీవితమే అమృతం.

 

జీవితాల్లో పాగా వేస్తున్న , పొగాకు మానెయ్యండీ సార్.!అంటే ఎందుకు మానేయ్యాలి..ఆ..ఎందుకు మానెయ్యాలి అస్తమానం మానెయ్.. మానెయ్..అంటూ వెంట పడతారు.ఎందుకు మానాలండీ “మాచన” గారు అని ప్రశ్నించారు.సార్..పొగాకు, ధూమపానం అలవాట్లను ఇందుకు మానేయ్యాలి అంటూ ఎంతో మందికి ఇలా సహేతుకంగా వివరించడం జరిగింది.నేను వైద్యున్ని కాక పోవచ్చు కానీ రెండు దశాబ్దాలకు పైగా పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్న సమాజ శ్రేయోభిలాషి గా.. పొగాకు,ఆ వ్యసనం ఉన్న వాళ్ళను ఎలా ఊబి లోకి లాగుతుంది అని ఇక్కడ వివరించా.పొగాకులో నికోటిన్ అనే రసాయనం మెదడు మీద పనిచేసి ఉత్తేజితం చేస్తుంది.

ఆ ఉత్తేజం మొదట్లో నాలుగైదు గంటలుండి తరువాత గంటకి తగ్గిపోయి చివరికి, నికోటిన్ లేకపోతే చికాకు కలగటం, ఏకాగ్రత లేకపోవటం మొదలైన లక్షణాలు ప్రారంభమై అవి తగ్గటానికి పొగాకు తాగవలసి వస్తుంది. ఆవిధంగా చాలా త్వరగానే పొగాకుకు అలవాటైపోతారు.పొగాకు పొగలో దాదాపు ఏడొందల రసాయనాలున్నట్లు వాటిలో నాలుగొందలు క్యాన్సర్ కారకాలని లేదా అంశాలని తేలింది. పొగాకు వలన ఈ క్యాన్సర్లు వస్తాయి – నోరు, గొంతు, అన్నవాహిక, మెడ, ఊపిరితిత్తుల, జీర్ణాశయ, క్లోమ గ్రంధి, మూత్రపిండాల, చిన్నప్రేగు, పెద్దప్రేగు, మెదడు, గుండె, కాలేయం, మూత్రాశయం మరియు ఎముకలు సంబంధించి. పొగాకు వలన ఊపిరితిత్తుల్లో వాయుగోణులు, వాయునాళాలు దెబ్బతిని అవి చీమిడి(శ్లేష్మం)తో నిండిపోయి విపరీతమైన దగ్గు, ఆయాసంతో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఉబ్బసం తిరగబెడుతుంది.

పొగాకు వలన రక్తపోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం తద్వారా పక్షవాతం, గుండెవిఫలం, అలాగే అకాలమరణం సంభవిస్తాయి. మూత్రపిండాలు కూడా చిన్నవైపోయి, మూత్రం తయారవక ఒళ్ళంతా ఉబ్బిపోయి ఊపిరాడక చనిపోతారు. ఈచావు చాలా మెల్లిగా క్షణక్షణం నరకంలా ఉంటుంది.పొగాకు వలన అంగంలో రక్తనాళాలు మూసుకుపోయి సంభోగసమయంలో గట్టిపడకపోవడం అలాగే, వీర్యకణాలు నశించి సంతానం కలగకపోవడం జరగవచ్చు. మీ జన్యువులు మీతో ఆగిపోతాయి మీరెంత తెలివైనవారైనా. పొగాకువలన రోగనిరోధకశక్తి తగ్గి క్షయ వంటిరోగాలు సులువుగా సంక్రమిస్తాయి. అలాగే ఆటోఇమ్మ్యూన్ రోగాలైన ల్యూపస్, రుమటాయిడ్ మొదలైనవి చికిత్సకి లొంగవు.పొగాకువలన రక్తంలో ఆక్సిజన్ తక్కువయి, దానికోసం ఎక్కువ హిమోగ్లోబిన్ తయారయి రక్తం చిక్కబడిపోతుంది, దానివలన ఎక్కడికక్కడ గడ్డకట్టేస్తుంది. దీనివలన మెదడు మెల్లిమెల్లిగా చిన్నదయిపోయి మతిమరుపు వస్తుంది.

పొగాకువలన చిగుళ్లు పాడయి దంతాలు త్వరగా ఊడిపోతాయి. అలాగే నోటిలో వేసుకునే గుట్కా వలన నోటిలోపలి చర్మం దళసరిపోయి చివరికి నోరుతెరిచి అన్నం తినలేని పరిస్థితి వస్తుంది, దీనిని సబ్మ్యూకోసల్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి వైద్యం లేదు. నోటి క్యాన్సరు వలన కింది లేదా పై దవడ తీసెయ్యటం/ రేడియోథెరపీ వలన అక్కడంతా నల్లగా కమిలిపోవడం జరుగుతుంది. పొగాకు వలన చర్మం త్వరగా ముడతలు పడటం, జుట్టు ఊడటం జరిగి ముసలితనం ముందుగా వస్తుంది. కొంతమంది పై వాటివలన ముసలితనానికి ముందుగానే స్వర్గద్వారాల తలుపులు తడతారు.

పొగాకు వలన గాయాలు మానటం ఆలస్యం అవుతుంది. కాళ్లలో రక్తనాళాలు కుచించుకుపోయి నడిస్తే నొప్పి, ప్రతి వంద రెండొందల మీటర్ల నడకకి విశ్రాంతి తీసుకోవాల్సి రావటం జరుగుతుంది.పొగాకు వలన మనం తీసుకునే మందులు త్వరగా నిర్వీర్యం అయిపోవటం దానివలన అవి పనిచేయకపోవడం లేదా మోతాదు పెంచి తీసుకోవాల్సిరావటం జరుగుతుంది.పొగాకు తాగినా, నమిలినా ఎలా తీసుకున్నా ప్రమాదమే, ఫిల్టర్ సిగరెట్లు, సాదా సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఖైనీ, గుట్కా వీటి వేటిమధ్యన తేడా లేదు. పొగాకు యే రూపంలోనైనా హానే.పొగాకు అలవాటు ముందుగా యుక్తవయస్సులో ప్రయోగంగా ప్రారంభమై ముఫై లోకొచ్చేసరికి అలవాటు తర్వాత వ్యసనంగా మారిపోతుంది.

పొగాకు తాగేవాళ్ళ నోరు, బట్టలు వాసన కొడతాయి. వేళ్ళు రంగుమారుతాయి, పెదాలు నల్లగా మారిపోతాయి. జేబులో బరువు మొయ్యాలి. ఇవన్నీ చూసి ఎవరూ శృంగారానికి ఇష్టపడరు. పొగతాగటం మగతనం కాదు. అదొక బలహీనత.పొగాకు వలన జేబు గుల్లవుతుంది, ప్రభుత్వానికి పన్నులవలన మంచి ఆదాయం. పొగాకు తాగేవాళ్ళవలన వారితో నివసించే లేదా చుట్టూఉన్నవాళ్ళకి పైవన్నీ ఆ పొగ పీల్చటం వలన వస్తాయి.పొగాకు బదులు ఇప్పుడు వస్తున్న వేపింగ్ (అంటే నికోటిన్ ద్రావణాన్ని మరిగించి పీల్చటం) కూడా శ్రేయస్కరం కాదు.పొగాకు తాగేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. పొగాకు తాగటం ఒక బలహీనత మాత్రమే అంతమాత్రం చేత వాళ్ళని చీదరించుకోవాల్సిన అవసరం లేదు. పొగాకు వ్యసనాన్ని సులువుగా మాన్పించవచ్చు. దీనికి కావలసింది ధృడ సంకల్పం, కొద్ది తోడ్పాడు, అలాగే మానసిక నిపుణుల సలహా. దీనికి మందులు కూడా ఉన్నాయి.

పొగాకును మన జీవితాల నుండి తరిమికొడదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

మాచన రఘునందన్
9441252121
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News