Friday, September 19, 2025

జెపిఎస్‌ల క్రమబద్దీకరణకు జిల్లా కమిటీలు

- Advertisement -
- Advertisement -
కమిటీ నోడల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్, సభ్యులుగా పోలీసు, అటవీ అధికారులు

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శు (జెపిఎస్)ల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల నిరంతర శిక్షణ కాలం పూర్తి చేసిన వారికే క్రమబద్ధీకరణ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. గ్రామ పంచాయతీల నిర్వహణ, పాలన, ఇతర అంశాల ప్రాతిపదికన వారికి మార్కులు కేటాయించి పనితీరు మదింపు చేయాలని సూచించింది. ఇందుకోసం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన ఎస్పీ/ డీఎస్పీ, జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌వో)లతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని సందర్శించి, పరిశీలన అనంతరం మార్కులు కేటాయించాలని, వాటి ఆధారంగా కలెక్టర్ క్రమబద్ధీకరణకు అర్హులైన వారి పేర్లను సూచించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసిన జెపిఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది. ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పిఆర్) ఓ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణకు ప్రతిపాదనలను పిఆర్ కమిషనర్‌కు సమర్పించనున్నారు. ఈ నివేదికలపై పిఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.

రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ.. తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా మదింపు అనంతరమే తమను రెండో ఏడాది కొనసాగించారని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మదింపు చేపట్టడం ద్వారా పరిస్థితి మొదటికి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో మూడేళ్ల శిక్షణ కాలాన్ని నిర్దేశించిందని, తాజా ఉత్తర్వుల్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన వారికే అవకాశం కల్పించడం వల్ల దాదాపు 40 శాతం మంది నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

2019 ఏప్రిల్ 12న మొదటి బ్యాచ్ విధుల్లో చేరగా… తర్వాత సెప్టెంబరు వరకు నియామకాలు జరిగాయి. మొత్తం 9355 మందిలో 5600 మంది మాత్రమే నాలుగేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్నారని, మిగిలిన వారికి అవకాశం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కుల కేటాయింపులో కరెంటు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐల చెల్లింపుల వంటిపై చేర్చడంపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచుల అనుమతితో తాము వీటిని చెల్లించాల్సి ఉంటుందని, బిల్లులు రాకపోవడంతో వారు చెల్లింపులు జరపడం లేదని, దీనికి తమను బాధ్యులుగా చేయడం తగదని అంటున్నారు.
నిబంధనలను సరళతరం చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు సహేతుకంగా లేవని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ.శ్రీనివాస్‌లు తెలిపారు. నిబంధనలను సరళతరం చేసి, జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News