యూనివర్సల్ సృష్టి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐవిఎఫ్ కోసం వచ్చిన పిల్లలు లేని దంపతులను సరోగసి పేరుతో మావన అక్రమ రవాణాకు పాల్పడడంతో గోపాలపురం పోలీసులు సృష్టి యజమానురాలు డాక్టర్ నమ్రతపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మంది ఏజెంట్లతో పాటు 26మందిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డాక్టర్ నమ్రత, సంతోషి, కల్యాణిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు విషయాలు తెలుసుకున్నారు. నమ్రత నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కస్టడీకి మరోసారి ఇవ్వాలని గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సరోగసి పేరుతో పేరుతో పేద దంపతులకు డబ్బులు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేసి పిల్లలు లేని దంపతులకు రూ.30 నుంచి 50లక్షలకు విక్రయించిన నమ్రత, ఇప్పటి వరకు 70 నుంచి 80మందిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. పిల్లలను విక్రయించి దాదాపుగా రూ.24కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. వారి వివారాల కోసం ఆరా తీయగా ఎలాంటి రికార్డులు లేవని, దంపతుల అడ్రస్‌లు లేవని చెప్పినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులకు పిల్లలను కొనుగోలు చేసి విక్రయించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది.
నమ్రత వద్దకు వచ్చిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే నమ్రత వీరికి సంబంధించిన రికార్డులు మెయిన్‌టేయిన్ చేయనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన వ్యాపారం కోసం ఎపిలోని విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్, హైదరాబాద్‌లో మహిళా ఏజెంట్లను నియమించుకుని దందా చేసినట్లు తెలిసింది. గతంలో తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం ఆరుగురు ఏజెంట్లను అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ జంట వద్ద కూడా నమ్రత పిల్లల కోసం రూ.24లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ బాధితులు గోపాలపురం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కస్టడీ పూర్తి కావడంతో కల్యాణి, సంతోషిని గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. సృష్టి కేసులో ఏ16గా ఉన్న డాక్టర్ విద్యుల్లతకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తుండగా గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సీనియర్ వైద్యురాలి పేరుతో
సికింద్రాబాద్‌కు చెందిన ఓ సీనియర్ వైద్యురాలి లెటర్ హెడ్‌ను ఉపయోగించుకుని డాక్టర్ నమ్రత మందులు, ఇంజక్షన్లు రాసినట్లు బయటికి వచ్చింది. ప్రముఖ ఆస్పత్రి, రిసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యురాలి లెటర్ హెడ్‌ను ఉపయోగించిన విషయం సదరు వైద్యురాలికి తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిసింది. వెంటనే గోపాలపురం పోలీసులకు నమ్రతపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గతంలోనే ఆస్పత్రికి సీజ్ చేయడంతోపాటు డాక్టర్ నమ్రత సభ్యత్వాన్ని ఎంసిఐ రద్దు చేయడంతో తన పేరుతో చికిత్స చేయకుండా అయింది. దీంతో ప్రముఖ వైద్యురాలికి తెలియకుండానే ఆమె లెటర్ హెడ్ ఉపయోగించుకునట్లు తెలిసింది.
బ్యాంకులో కోట్ల రూపాయలు..
సృష్టి పేరుతో అక్రమాలకు పాల్పడిన నమ్రత కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. డబ్బులపై దృష్టి పెట్టిన పోలీసులు ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్‌లపై ఆరా తీస్తున్నారు. ఆమె పేరు, సృష్టి పేరుతో ఏ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. కొన్ని బ్యాంక్ ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేశారు. పోలీసుల గుర్తించిన బ్యాంక్ ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన బ్యాంక్ ఖాతా నుంచి నమ్రత సంతోషి బ్యాంక్ ఖాతా, ఇతరుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.