Wednesday, September 24, 2025

సమితి వేదికపైనా ట్రంప్ అదే పాట

- Advertisement -
- Advertisement -

తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లే ఉంటుందన్నది సామెత. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ సామెత నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. తాను రెండోసారి పదవి చేపట్టాక ఎన్నో యుద్ధాలను ఆపానని, కాబట్టి తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వితండవాదం చేస్తున్న ఈ పెద్దమనిషి, చివరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలోనూ అదే పాట పాడారు. గత ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపానంటూ చిట్టా విప్పిన ట్రంప్ మహాశయుడు పాకిస్తాన్-భారత్ ఘర్షణను కూడా మరొకసారి తన ఖాతాలోకే వేసుకున్నారు. ఆయన ఏకరువు పెట్టిన జాబితాలో ఇజ్రాయెల్- ఇరాన్, రువాండా -కాంగో, థాయ్‌లాండ్- కంబోడియా, ఆర్మేనియా -అజర్ బైజాన్, ఈజిప్ట్- ఇథియోపియా, సెర్బియా- కోసావో ఘర్షణలు ఉన్నాయి. పైపెచ్చు, తాను ఇంతగా కష్టపడుతుంటే, ఐక్యరాజ్యసమితి చేసిందేమీ లేదంటూ నిందలు మోపారు.

యుద్ధాలను విరమింపజేసేందుకు జరిగిన చర్చల ప్రక్రియలో సమితినుంచి ఏమాత్రం సాయం అందకపోగా, తనను అభినందిస్తూ సమితి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ఆయన దుయ్యబట్టారు. సమితినుంచి తమకు అందినవి కేవలం శూన్యహస్తాలు.. శుష్కప్రియాలూ మాత్రమేనంటూ నిరసించారు. అంతటితో ఆగారా అంటే, తాను రెండోసారి పదవి చేపట్టాక అమెరికాలో మార్పు వచ్చిందని, ఇది తమ దేశానికి స్వర్ణయుగమని భుజాలు చరుచుకున్నారు. చిల్లర యుద్ధాల గురించి మాట్లాడిన ట్రంప్, ఇప్పటికే వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం విషయం వచ్చేసరికి మాత్రం పాత పాటే పాడారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ముందుకొచ్చిన దేశాలపై ఆయన సమితి వేదికగా విరుచుకుపడ్డారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా ఆయా దేశాలు పరోక్షంగా హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. దీంతో ఇజ్రాయెల్ పట్ల ఆయన వైఖరిలో కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేని తన అశక్తతను కప్పిపుచ్చుకుంటూ, యుద్ధానికి కారకులంటూ భారత్, చైనాలపై నింద మోపడం మరో విడ్డూరం. ఉగ్రవాదులను, అమాయక జనాన్నీ ఒకే గాటన కట్టి గాజాలో నరమేధం సాగిస్తున్న ఇజ్రాయెల్ ఆట కట్టించేందుకు ఇటీవలి కాలంలో పలు దేశాలు ముందుకు రావడం అమెరికా అధ్యక్షుడికి సుతరామూ నచ్చడం లేదన్న విషయం ఆయన ప్రసంగాన్ని గమనిస్తే విశదమవుతుంది.

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మొన్న బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించగా, తాజాగా ఆరు దేశాలు.. ఫ్రాన్స్, ఆండొర్రా, బెల్జియం, లక్సెంబర్గ్, మాల్టా, మొనాకో పాలస్తీనాకు అనుకూలంగా చేతులు కలిపాయి. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వప్రతినిధుల సమావేశానికి ఒక రోజు ముందు ఆయా దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకమైనది. అంతకుమించి, హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యమని చెప్పుకుంటూ మారణహోమం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను, దాని ఆగడాలకు వంతపాడుతున్న అమెరికాను ఒంటరిని చేసేందుకు ప్రపంచ దేశాలు తీసుకున్న పరోక్ష నిర్ణయంగా ఈ పరిణామాన్ని భావించవచ్చు. ఒకప్పుడు తన అధీనంలోనే ఉన్న పాలస్తీనా పట్ల బ్రిటన్ వైఖరిలో మార్పు రావడం కూడా అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది. ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటానంటూ ప్రతిన చేసిన నెతన్యాహూ, ఆ మాట మరచి, అమాయక జనాన్ని ఊచకోత కోస్తూ గాజాలో నెత్తుటేర్లు పారిస్తున్నారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధానికి గాజాలో ఇప్పటివరకూ బలైనవారి సంఖ్య అక్షరాలా 63 వేలకు పైమాటే. అమెరికా అండదండలు ఉండటంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ఆగడాలను ఓపికగా సహించిన మిత్రదేశాలు ఇప్పుడు ఒక్కటై ముందుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ కోరలు పెరకివేయాలంటే ముందుగా అగ్రరాజ్యం వైఖరిలో మార్పు తీసుకురావడం అవసరం.

అమెరికానుంచి అందుతున్న ఆర్థిక, ఆయుధ సహాయాలే ఇజ్రాయెల్ కు కొండంత అండ. అమెరికాపై ఒత్తిడి పెంచడం ద్వారా ఇజ్రాయెల్ ఆటకట్టించేందుకు ప్రపంచదేశాలు కార్యాచరణను ముమ్మరం చేయాలి. వాణిజ్య సుంకాల విషయంలో దేశదేశాలన్నీ ఒక్కటవుతున్న మాదిరిగానే గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రపంచదేశాలన్నీ ఏకం కావాలసిన తరుణమిది. మిత్రదేశమైన ఇజ్రాయెల్ తో అంటకాగుతూ అగ్రరాజ్యం తప్పుమీద తప్పు చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని, బందీలను తక్షణమే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 14 దేశాలు ఓటు వేసినా, అమెరికా మాత్రం వీటో చేసింది. ఇలా అగ్రరాజ్యం వీటో చేయడం ఇది ఆరోసారి. పాలస్తీనా ప్రజలను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్ కు నిర్మొహమాటంగా వంత పాడుతున్న ట్రంప్ మహాశయుడు నోబెల్ బహుమతిని ఆశించడం అర్హత లేని అందలం కోసం అర్రులు చాచడమే.

Also Read: ఇది అమెరికాకే స్వీయహాని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News