Friday, May 3, 2024

వేలాడుతున్న ఒత్తిడి కత్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల ఒత్తిడిలో ఇంటర్ విద్యార్థులు అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా నమోదవుతున్నా…వాటిని నివారించడంలో కళాశాలల యాజమాన్యాలు, ఇంటర్ బోర్డు, విద్యాశాఖ విఫలమవుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగి కొన్ని రోజులు గడిచిన తర్వాత కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు నష్టపరిహారం ఇచ్చి కేసులు లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కొన్ని సందర్భాలలో కళాశాల సిబ్బందిపై కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. చదువుల ఒత్తిడి భరించలేక ఏళ్ల తరబడి ఇంత మంది తనువు చాలిస్తున్నా, వాళ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆరా తీయడం లేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలను గుర్తించి, విశ్లేషించి, ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా సంఘటన జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు.
అధ్యాపకుల మానసిక స్థితి కారణమే
విద్యార్థుల ఆత్మహత్యలకు అధ్యాపకులు మానసిక పరిస్థితి, వారి ప్రవర్తన కూడా కారణమవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సైకో, షాడిజం మనస్తత్వం కలిగిన అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది మానసిక స్థితిపై కనీస అవగాహన లేకుండానే విద్యాసంస్థల్లో నియమించుకుంటున్నారు. దాంతో పాటు కళాశాలల్లో అర్హులైన సైకాలజిస్టులను నియమించుకోవాలనే నిబంధన ఉన్నా కళాశాలలు దానిని పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఈ స్థితిని భరించలేక బతకడం కంటే చావడమే మేలని తనువు చాలిస్తున్నారు. విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మానసిక పరిస్థితి పరిశీలించకుండానే కాలేజీల్లో నియమించుకుంటున్నారు.

ఆయా సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉండి, తక్కువ వేతనానికి లభించే అధ్యాపకులనే యాజమాన్యాలు నియమించుకుంటున్నారు. అలాగే తక్కవ వేతనాలకు లభించే బోధనేతర సిబ్బందినే ఎంపిక చేసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు. సున్నిత మనస్తత్వం కలిగిన విద్యార్థులతో కొందరు దురుసుగా ప్రవర్తించడం, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను అందరి ముందు హేళన చేసి మాట్లాడటం వంటి కారణాల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కాలేజీల్లో తమ సమస్యను అర్థం చేసుకునే వారు లేక ఎవరితో చెప్పకుండా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
విద్యార్థుల ఇష్టాఇష్టాలను అర్థం చేసుకోకుండానే
పదవ తరగతి పూర్తయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటర్ విద్య కోసం కార్పోరేట్ కళాశాలల్లో చేర్పించి రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత మొత్తంలో ఫీజులు చెల్లించాం కాబట్టి కచ్చితంగా ర్యాంకు రావాల్సిందే అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ర్యాంకు రాదనుకున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల సామర్థం, వారి ఇష్టాఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా ఐఐటి, జెఇఇ, నీట్ వంటి కోచింగ్‌లలో చేర్పిస్తున్నారు. కళాశాలలు ఎలాగైనా ర్యాంకు తెప్పించాలని విద్యార్థుల మానసిక స్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చదివించడంతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. పదవ తరగతి వరకు అందరికీ ఒకేలా అన్ని సబ్జెక్టులు ఉంటాయి. టెన్త్ తర్వాత గ్రూప్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎంచుకున్న గ్రూప్‌తో పాటు ఐఐటి,జెఇఇ, నీట్ వంటి అదనపు సిలబస్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఐఐటి, జెఇఇ, నీట్ వంటి పోటీపరీక్షల్లో కచ్చితంగా ర్యాంకు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు, కళాశాలల నుంచి ఉండటంతో ర్యాంకు రాదనుకునే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఇష్టాఇష్టాలు, వారి అభిరుచులు తెలుసుకుని వారికి నచ్చిన గ్రూపును ఎంపిక చేసుకునే స్వేఛ్చ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ర్యాంకులే పరమావధిగా కాకుండా ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థాలను విశ్లేషించి అందుకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చదివించాలని చెబుతున్నారు.
నేడు కార్పోరేట్ యాజమాన్యాలతో సమావేశం
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం 14 కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు సమావేశం నిర్వహించనన్నారు. ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేయవద్దని, తప్పనిసరిగా కాలేజీల్లో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచేలా కాలేజీలకు దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News