Tuesday, November 28, 2023

పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి

- Advertisement -
- Advertisement -
  • ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది
  • కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన కెసిఆర్
  • రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్
  • సిఎంగా మరోసారి దేశంలో చరిత్రను సృష్టించపోతున్న కెసిఆర్
  • చిమ్మపూడి ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రఘునాథపాలెం : పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రిని మండల పార్టీ బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఎక్కించి గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసి మంత్రి సభను ఉద్దేశించి మాట్లాడారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిందని చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ది కేవలం గడిచిన తొమ్మిదేళ్ల కెసిఆర్ హయాంలోనే సాధ్యమైందన్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలను చూసి కొన్ని అతీతశక్తులు జీర్ణించుకులేక పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ధికంగా బలపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ ను గద్దె దించుతాం… బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతా.. అంటూ ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. డబ్బుతో, అహంతో ప్రజల ఆత్మీభిమానాన్ని కొనుక్కోలేవనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.

ప్రజాప్రతినిధిగా చేసిన మంచి పనులతోనే ప్రజల నుంచి ప్రేమాభిమానాలు పొందవచ్చుననే విషయాన్ని గమనించాలన్నారు. కాంట్రాక్టర్ గా అడ్డదారుల్లో కోట్లకు పడగలెత్తిన వ్యక్తి తన అనుయాయులతో తనపై తప్పుడు ప్రచారాలను చేయించి అవినీతి ముద్ర వేయించాలనే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీకు తెలంగాణలో దిక్కులేని పరిస్థితులే ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పుట్టగతులే ఉండవన్నారు. 119 సీట్లకు గానూ కాంగ్రేస్ పార్టీ 80కి పైగా సీట్లల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారన్నారు.

కర్ణాటకలో బీజేపీ పూర్తిగా విఫలం కావడంతో ప్రజలకు అవకాశం లేక ప్రత్యామ్నాయంగా కాంగ్రేసు ఆదరించారే తప్ప మరోకటి కాదని మంత్రి పువ్వాడ వివరించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి కనీసం డిపాజిట్లకు కూడా సరిపడా ఓట్లు కూడా దక్కవని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ తాను తెచ్చుకున్న కరెన్సీ నోట్లను రెండు సార్లు రద్దు చేసి చరిత్ర సృష్టించాడన్నారు. కరెన్సీ నోట్ల రద్దుతో దేశ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి.. కార్పోరేట్లకు మాత్రం నోట్లను మార్చుకునేందుకు సలువైన బార్లను తెరిచి ఉంచారన్నారు

  • ఎన్నికలకు సమాయత్తం కావాలి

అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు నెలలు మాత్రమే సమయం ఉందని, గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. చిన్నచిన్న బేధాబిప్రాయాలు ఉన్నా.. వాటన్నింటినీ పక్కనపెట్టి కలిసి మెలసి పని చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతిఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకోవాలంటే మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మద్య ఎలాంటి పొరపొచ్చాలు ఉన్నా వాటన్నంటినీ పక్కన పెట్టి ముందుకు సాగాలన్నారు.

రాష్ట్రంలో ఏకబికిన అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పని చేసి సీఎంగా కెసిఆర్ దేశంలో చరిత్రను సృష్టించపోతున్నారన్నారు. అదేక్రమంలో వచ్చే ఎన్నికల్లో 3వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మరో చరిత్రను తిరగరాయపోతున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కెసిఆర్ అన్నారు. 70ఏళ్లలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి సాధ్యం కానిపని తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన సీఎం కెసిఆర్ కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో ప్రజల ముందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యామ్లు, ప్రాజెక్టులను నిర్మించి గంగాలాలుగా ఉన్న చెరువులను తాంబాలాలుగా మార్చారని పేర్కొన్నారు. రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వంగా బీఆర్‌ఎస్ దక్కిందన్నారు. సంక్షేమాన్ని పేదల దరికి చేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా కెసిఆర్ నిలిచారన్నారు. రానున్న రోజుల్లో కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచి మరోమారు తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తన గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పిన మంత్రి.. జిల్లాలో మిగిలిన స్థానాలనూ గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నారు.

ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీకి అతిపెద్ద సైన్యమే ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. ఈ సభకు వైస్ ఎంపీపీ గుత్తా రవి అధ్యక్షత వహించగా ఎంపీపీ భుక్యా గౌరి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అద్యక్షుడు అజ్మీర వీరూనాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, గ్రామ సర్పంచ్ గొర్రె కృష్ణ వేణి, బీఆర్‌ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు కాంపాటి రవి, యూత్ అద్యక్షుడు గంగిరెడ్డి విజయెడ్డి, రైతుబంధు సమితి అద్యక్షుడు దొంతు సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం : ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను రఘునాథపాలెం మండల రిపోర్టర్ పిన్ని సత్యనారాయణ, కృష్ణ, ప్రసాద్, శ్రీనివాస్, నాగార్జున, రాము, శ్రీహరి తదితరులు సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News