బిఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు తమతో ‘టచ్’లో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శుక్రవారం తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరువురూ కొంత సేపు మంతనాలు జరిపారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బాల రాజు ఈ నెల 10న తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు. అంతేకాకుండా మరో ఐదారుగురు మాజీ ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకునే ఆలోచన ఏదీ తమకు లేదన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు ఉంటాయని ఆయన తెలిపారు. అదేమిటీ? అని ప్రశ్నించగా, ఇంకా చాలా మంది పార్టీలో చేరుతారని ఆయన అన్నారు. వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. కొత్త వారినని, పాత వారిని కలుపుకుని వెళతామని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. బిసి రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే అందులో మతపరమైన రిజర్వేషన్లు చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని రాంచందర్ రావు తెలిపారు.