రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి తమ పార్టీలోకి అనేక మంది నాయకులు పెద్ద ఎత్తున రానున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఆదివారం బిజెపిలో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి గువ్వల తన అనుచరులతో వచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు గువ్వల మెడలో పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద గ్రేటర్‌కు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ స్వాగత ద్వారం నిర్మించాలని అధికారులను ఆదేశించడాన్ని ప్రస్తావిస్తూ బిజెపిలోకి గేట్ వే ఆఫ్ తెలంగాణగా మారుతుందన్నారు. ఇప్పుడు బాలరాజు చేరినట్లే ఇంకా వివిధ పార్టీల నుంచి అనేక మంది నాయకులు రాబోతున్నారని ఆయన తెలిపారు.
మేధావులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు బిజెపిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 16 జిల్లాల్లో 3500 కిలో మీటర్ల వరకూ పర్యటించానని అన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలను కలుసుకున్నానని, దారి పొడుగునా ప్రజలు తమ సమస్యల గురించి చెప్పారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించి ఓట్లు వేసి గెలిపిస్తే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పాలన చూశారు కాబట్టి ఒక దఫా బిజెపికి అధికారం ఇచ్చి చూడండి అని ఆయన కోరారు.
ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లు, ఓట్ల చోరీ అంటూ కొత్త రాగం అందుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు ఫేక్ ఓట్లు, ఓట్ల చోరీ గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి ఓడినా, గెలుపొందినా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని ఆయన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రసంగిస్తూ దేశ భక్తి కలిగిన అనేక మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోడి ప్రతి పేద వాడికి సంక్షేమం, ప్రభుత్వ ఫలాలు, గౌరవం అందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. నిబద్ధత గల కార్యకర్తగా పని చేస్తానని గువ్వల తెలిపారు.