Thursday, February 29, 2024

ప్రతిజ్ఞ చేద్దాం.. పాటిద్దాం!

- Advertisement -
- Advertisement -
happy-new-year
సరికొత్త తీర్మానాలు…

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ప్రతి ఒక్కరూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాగే గత ఏడాది తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిలబెట్టుకున్నామో కూడా ఓ సారి సమీక్షించుకోవడం అవసరం. 2019 సంవత్సరానికి వీడ్కోలు చెప్పి 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టే వేళ గత సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిలబెట్టుకున్నారు? మీరు వదిలి పెడతామనుకున్న చెడు అలవాటును వదిలి పెట్టారా? అలాగే మీరు చదవాలనుకున్న మంచి పుస్తకాలను చదివేశారా?మీకు ఎంతో ఇష్టమైన ప్రాంతానికి వెళ్లారా? రోజూ జిమ్‌కు వెళూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారా? గత ఏడాది తీసుకున్న తీర్మానాల్లో చాలా వాటిని వివిధ కారణాల వల్ల మీరు నిలబెట్టుకోక పోయి ఉండవచ్చు.

అది చాలా సహజం కూడా. అంతమాత్రాన నిరాశ చెందకండి. వాటిని మరోసారి గుర్తు చేసుకుని వాటితో పాటుగా కొత్త సంవత్సరం మరిన్ని కొత్త తీర్మానాలు తీసుకోండి. హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తుందదనే విషయాన్ని మరిచిపోవద్దు. అయితే అందరూ పాటించదగిన కొత్త సంవత్సరపు తీర్మానాలు కొన్నిటిని ఇప్పుడు చూద్దాం..

సామాజిక జీవనం

ఇప్పుడంతా చాటింగ్‌లు, మెస్సేజిల యుగం. అయితే ఇలా చేయడం వల్ల వ్యక్తులతో సంబంధాలు తెగి పోతున్నాయనే విషయాన్ని మనం మరిచి పోతున్నాం. బంధువులనో, మిత్రులనో లేదా మన కాలనీలో వ్యక్తులనో వ్యక్తిగతంగా కలుసుకోవడం వల్ల వారితో మన సంబంధాలు బలపడతాయి. అందుకే కొత్త సంవత్సంలో మెస్సేజిలు పంపడం, ఫోన్లో చాటింగ్‌లు చేయడం లాంటి వాటికి కాస్త విరామమిచ్చి మీకు ఇష్టమైన వ్యక్తులను నేరుగా కలుసుకోవడం అలవాటు చేసుకోండి.

ఇష్టమైన వస్తువును కొనండి

ఫోన్, కొత్త డ్రెస్, కారు లేదా బైక్ లేదా ఇంటికి అవసరమైన వస్తువు.. ఇలా మీకు ఇష్టమైన ఏదయినా ఒక వస్తువును ఈ కొత్త సంవత్సరంలో కొనేయండి. అది ఏదో సాధించేశామన్న అనుభూతిని కలిగించడంతో పాటుగా కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇలా కొత్త సంవత్సరంలో మీకు ఇష్టమైన లక్షాలను నిర్ణయించుకొని, వాటిని నెరవేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.

కొత్త భాష నేర్చుకోండి

మాతృభాష తో పాటుగా మనం ఎన్ని కొత్త భాషలను నేర్చుకుంటే అంతగా ప్రపంచం పట్ల మన అవగాహన పెరుగుతుంది. మనం ఏదయినా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి భాష మనకు అర్థం కాకపోవడం ఒక్కో సారి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది కూడా. వేరే భాషలను నేర్చు కోవడం వల్ల అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానం లాంటి వాటి పట్ల మనకు అవగాహన పెరగడమే కాకుండా వారికి మనం దగ్గరైన అనుభూతి కలుగుతుంది . అది ఒక అదనపు క్వాలిఫికేఫన్ కూడా.

సంగీతం సగంబలం

సంగీతం మానసికానందాన్ని కలిగించడంతో పాటుగా మానసిక చింతలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి సంగీతాన్ని వినడంవల్ల మానసికానందం కలుగుతుందనేది నిజమే కానీ, మనమే ఒక సంగీతం నేర్చుకుని వాయించడమో, పాడడమో చేయడం వల్ల రెట్టింపు ఆనందం కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. గిటార్, పియానో, ఫ్లూట్, వీణ. సితార్ తబలా, డ్రమ్స్… ఇలా మీకు ఇష్టమైన వాయిద్యాన్ని నేర్చుకోవడం కొత్త సంవత్సరంలో మొదలు పెట్టండి.

మొక్కలు, పెరటి తోట పెంపకం

భూతాపం పెరిగిపోవడం కారణంగా మనం తినే ఆహారం కలుషితం అవుతోంది. బయటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు వృథా ఖర్చు కూడా. అందుకే మన ఇంటిలోనే మనకు అవసరమైన కాయగూరలు, పండ్లు, ఓషధులు లాంటివి పెంచడం అలవాటు చేసుకోండి. దీనికి కొంత సమయం, శక్తి అవసరమవుతాయనేది నిజమే. అయితే మీరు పెంచిన మొక్క ఒక పూవు పూసినప్పుడు.. లేదా ఒక చెట్టు కాయ కాసినప్పుడు కలిగే ఆనందానికి విలువ కట్ట లేము. అది ఇంటికి, మన మనసుకు, శరీరానికి మేలు చేయడంతో పాటుగా పర్యావరణానికీ మేలు చేస్తుంది.

యోగా, ధ్యానం

శరీరం పట్ల ఎక్కువ దృష్టి పెట్టడం కారణంగా మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది అశ్రద్ధ వహిస్తుంటారు. కనీసం ఈ ఏడాది అయినా మీ మానసిక ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి. మానసిక ఆరోగ్యం బాగుంటే అంతర్గతంగా మీరు బలంగా ఉంటారు. మీ మనసుతో పాటు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచే సరయిన యోగా, ధ్యాన మార్గాలను ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మీరు గతంలో కన్నా ఎంతో ఉత్సాహంగా, దృఢంగా ఉండగలుగుతారు.

అలా ఓ టూరేద్దాం…

కొత్తప్రాంతాలకు వెళ్లడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అది కొత్త అవకాశాల అన్వేషణకు ద్వారాలను తెరవడంతో పాటుగా, అలాంటి కొత్త ప్రాంతాల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన శక్తి సామర్థాలను అందిస్తుంది కూడా. విహార స్థలాలకు , చారిత్రక ప్రదేశాలకు, లేదా సాహస యాత్ర కోసం.. ఇలా ఏదయినా మీకు ఇష్టమైన చోటికి వెళ్లండి. అది మీకు కొత్త అనుభూతులను కలిగించడంతో పాటు మీ వ్యక్తిత్వ వికాసానికిసైతం తోడ్పడుతుంది.

పుస్తక పఠనం

పుస్తకాలు నిజంగా మంచి స్నేహితులని పెద్దలు అంటారు. మీకు నచ్చిన పుస్త్తకాన్ని చదివేయడం వల్ల ఎంత సంతోషం కలుగుతుందో ఒక్క సారి ఊహించుకోండి. దాని వల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది కూడా. ఈ కొత్త సంవత్సరం బుక్‌స్టోర్‌కు వెళ్లి మీకు నచ్చిన పుస్తకాన్ని కొనడమో, లేదా ఇబుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునో చదవడం మొదలు పెట్టండి.

happy new year 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News