మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళా సభ్యురాలి పట్ల ఇంత కర్కశంగా, అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్టేజి పైన ఉన్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రి శ్రీధర్ బాబుపై సీరియస్ అయ్యారని, అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబిత చేసిన తప్పా అని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు
వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యాలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. సబితపై అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు, రౌడీ మూకల దాడులకు బీఆర్‌ఎస్ ఎప్పుడు భయపడదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం నిలదీస్తూనే ఉంటామని, ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా హరీష్ రావు తన ట్వీట్ లో స్పష్టం చేశారు.